ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీక్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు..!

క్రికెట్ అంటే భారతీయులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెటర్లను అత్యంత ఎక్కువగా అభిమానిస్తుంటారు భారతదేశ పౌరులు. కొంత మంది అయితే, క్రికెట్ మ్యాచ్ టెలికాస్ట్ అవుతుందంటే చాలు.. టీవీకే అతుక్కుపోతుంటారు. ఈ సంగతులు పక్కనబెడితే.. టీమిండియా ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు తెలిపాడు. తన రిటైర్మెంట్ వెంటనే అమలులోనికి వస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. భారత మాజీ ఆటగాడు రోజర్ బిన్నీ కొడుకే స్టువర్ట్ బిన్నీ కాగా, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో సభ్యుడైన రోజర్ బిన్నీ అడుగు జాడల్లోనే ఆయన కుమారుడు స్టువర్ట్ బిన్నీ క్రికెటర్‌గా మారాడు. టీమ్ ఇండియా తరఫున మొత్తం 23 మ్యాచ్‌లు ఆడాడు.

ఇందులో 14 వన్డేలు, 6 టెస్టులతో పాటు మూడు టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. స్టువర్ట్ బిన్నీ దాదాపు 17 ఏళ్ల పాటు కర్నాటక జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడి సత్తా చాటాడు. 2013-14 సీజన్‌లో బిన్నీ 443 పరుగులు చేయడంతో పాటు 14 వికెట్లు తీసి ఆ సీజన్‌లో కర్నాటక జట్టు రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 4,796 పరుగులతో పాటు 146 వికెట్లు తీశాడు. ఇకపోతే దేశవాళీ క్రికెట్‌లో రాణించడంతో బిన్నీకి జాతీయ జట్టులో అవకాశం లభించింది.

2014లో తొలి సారిగా బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఆ పర్యటనలో భాగంగా మీర్పూర్‌లో జరిగిన రెండో వన్డేలో బిన్నీ కేవలం 4 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఇప్పటికీ వన్డేల్లో భారతీయ బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన అదే కావడం విశేషం. 2014 పర్యటనలో బిన్నీ ఏ విధంగా క్రికెటర్ జేమ్స్ అండర్సన్‌ను ఎదుర్కున్నాడో గుర్తు చేస్తూ ఒక ఫొటోను ఇటీవల సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది బిన్నీ వైఫ్. కాగా, ఆ పోస్టు పెట్టిన రెండు రోజులకే స్టువర్ట్ బిన్నీ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం గమనార్హం.