ఆయన లెక్కలు ఆయనకున్నాయ్.. సీఎం వద్ద ఎమ్మెల్యేల చిట్టా..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను బలోపేతం చేసి వలంటీర్లను నియమించింది. పల్లెల్లో వలంటీర్లు ప్రభుత్వ కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళతారు. పింఛన్ల పంపిణీతోపాటు అన్ని అఫీషియల్ పనులన్నీ వీరు చేస్తారు. ఇపుడు ఏపీలో ఎమ్మెల్యే కన్నా వలంటీరే విలువైన వ్యక్తి. ప్రభుత్వం కూడా వీరిని అలాగే గుర్తిస్తోంది. అధికారికంగా వీరు వలంటీర్లు అయినా.. వైసీపీకి మాత్రం సీక్రెట్ ఏజెంట్లులా పనిచేస్తున్నారని తెలిసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ వీరిని పలు సర్వేలకు ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం. ఆ ప్రాంత ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అనుచరులు, కుటుంబసభ్యులు.. ఇలా ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నారా? పాల్పడి ఉంటే ఏమేం చేశారు? అనే వివరాలు గుట్టుగా లాగినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలందరి చిట్టా వలంటీర్లు ఎప్పటికప్పుడు పార్టీ చీఫ్ జగన్ కు అందజేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసినప్పటినుంచి ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకు కరువైందట. ఏ ఊరి వలంటీర్ తమ గురించి ఏం చెప్పాడోనని మదనపడుతున్నారట. పాజిటివ్, నెగిటివ్ ఏదైనా వెంటనే తాడేపల్లికి తెలిసిపోతుందట. ప్రకాశం జిల్లాలోని ఓ ఎమ్మెల్యే సోదరుడు ప్రతి పనిలోనూ తనకు కమిషన్ ఇవ్వాల్సిందేనంటూ డబ్బు లాగుతున్నాడని రిపోర్టు ఇచ్చారని తెలిసింది. ఇలాగే నెల్లూరు జిల్లాలోని ఓ ఎంపీ కుమారుడు కమిషన్ల వసూలులో ముందున్నాడట. ఇక కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గరి బంధువులు వసూళ్ల పర్వం జోరుగా చేస్తున్నారని చెప్పారట. ఈ వివరాలన్నీ తెలుసుకొని.. క్రోడీకరించి రాబోయే కేబినెట్ విస్తరణలో మార్పులు, చేర్పులు చేస్తారని తెలిసింది. అంతేకాక.. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రస్తుత సిట్టింగులకు టికెట్ ఇవ్వాలా.. వద్దా అనే విషయం కూడా వలంటీర్లు ఇచ్చే రిపోర్టు పైనే ఆధారపడినట్లు తెలిసింది. ఎంతైనా ఆయన జగన్.. ఆయన లెక్కలు ఆయనకుంటాయి కదా..!