ఏపీ సర్కారుకు మరో సలహాదారు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు సీఎం మరో వ్యక్తిని నియమించారు. వైసీపీలోంచి టీడీపీలోకి వెళ్లి.. తిరిగి వైసీపీలో చేరిన జూపూడి ప్రభాకర్ రావును సోషల్ జస్టిస్ అడ్వైజర్ గా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వంలో ఇప్పటికే సలహాలిచ్చేవాళ్లు ఎక్కువ ఉన్నారనే విమర్శలు పట్టించుకోకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.. రుణం కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది.. కోర్టు కూడా సలహాదారుల గురించి ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఈ నియామకం జరగడం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు చెల్లించేందుకే డబ్బుల్లేవు.. వాటిని చెల్లించేందుకు కూడా ఎక్కడో ఓ చోట అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.. ఈ గడ్డు కాలంలో రాజకీయ మనుగడ కోసం నియమించడం సబబు కాదని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనపుడు ప్రభుత్వంలో ఖర్చలు తగ్గించుకొని గాడిన పెట్టాలని ఎవరైనా అనుకుంటారు.

అయితే.. రాష్ట్రంలో నిర్ణయాలు ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న సలహాదారులంతా ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు వేతనం తీసుకుంటున్నారు.. వారంతా ఏం సలహాలిచ్చారంటే సమాధానం లేదు. ఇపుడున్న అడ్వైజర్లతోపాటు జూపూడి కూడా నెలకు దాదాపు రూ. 3 లక్షలు వేతనం పొందుతారు.క్యాబినెట్ ర్యాంక్ ఎటూ ఉండనే ఉంటుంది. సెక్యూరిటీ కోసం రూ.25వేలు, ల్యాప్ టాప్ కొనుగోలుకు రూ.50వేలు, ఫర్నిచర్ కు రూ. 3 లక్షలు, ఇతర ఖర్చులకు రూ.1.5 లక్షలు. వీటితో పాటు ఒక ప్రైవేట్ సెక్రెటరీ, పర్సనల్ అసిస్టెంట్, అడిషనల్ పీఏ, ముగ్గురు ఆఫీసు సిబ్బంది, ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. ఇవన్నీ ఆలోచిస్తే ఏపీలో పరిస్థితులు ఎక్కడకు వెళతాయో అని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.