వర్చువల్‌గా వివాహపు ఉంగరాలు మార్చుకున్న అమెరికన్ జంట..!

కరోనా వైరస్‌ వేగంగా విజృంభిస్తున్న ప్రస్తుత రోజుల్లో అన్ని పనులు, కార్యక్రమాలు, సమావేశాలు వర్చువల్‌గానే జరుగుతున్నాయి. ఒకరికి ఒకరు ముట్టుకోవడం ఉండేందుకు ఈ వర్చువల్‌ విధానం చాలా ఉపయోగపడుతుంది. అయితే, కాలిఫోర్నియాకు చెందిన ఒక జంట తమ పెళ్లి చాలా ఆధునికమైనదిగా చెప్పుకోవడానికి గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చారు. రెబెక్కా రోజ్, పీటర్ కాచెర్గిన్స్కీ అమెరికన్ క్రిప్టోకరెన్సీ మార్పిడి వేదిక అయిన కాయిన్‌బేస్‌లో పని చేస్తున్నారు. వీరికి మార్చి 14 న పెళ్లి జరిగింది.

వారి పెళ్ళిలో ఒకరికొకరు వేళ్ళకు ఉంగరాలను తొడిగే బదులుగా వారు డిజిటల్ ఉంగరాల ను ఎన్‌ఎఫ్‌టీ రూపంలో తొడుక్కున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ ప్రేమకు సాక్ష్యమిచ్చే విధంగా తమ ఉంగరాలు ఇప్పుడు బ్లాక్‌చెయిన్‌లో ఉన్నాయని వధువు రోజ్ ట్విట్టర్‌ ద్వారా చెప్పింది. రింగులు ఇప్పుడు ఒకదానికొకటి క్రిప్టోకరెన్సీ వాలెట్‌లో ఉన్నాయి అని చెప్పింది. చాలా మంది ఈ జంటను అభినందించగా, కొందరు మాత్రం ఈ విధానం గురించి చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇంకొందరు వినియోగదారులు మీ ఇద్దరికీ అభినందనలు కానీ ఎవరైనా స్మార్ట్ కాంట్రాక్టును హ్యాక్ చేసి ఎన్‌ఎఫ్‌టీని కొల్లగొడితే అంటూ కొత్త జంటను ప్రశ్నిస్తున్నారు.