ఏపీలో పురందేశ్వ‌రి స్టార్ట్ చేసిన కొత్త ఆప‌రేష‌న్‌

పాలిటిక్స్‌లో నేతలు అడుగు తీసి అడుగు వేశారంటే.. ప్ర‌యోజ‌నం లేకుండా జ‌ర‌గ‌దు! అదే సీనియ‌ర్ నేత‌లు ప‌ర్య‌ట‌న‌లు, ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారంటే..దాని వెనుక ప‌ర‌మార్థం, ప్ర‌యోజ‌నం పుష్క‌లంగా ఉండి తీరుతుంది. ఇప్పుడు ఈ రెండింటినీ ఆశించే బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ కేంద్ర మంత్రి, ప్ర‌కాశం జిల్లాకు చెందిన అన్న‌గారి కూతురు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి.. తొలిసారి రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టించారు. రాజ‌కీయాల్లోకి ప్ర‌త్య‌క్షంగా ప్ర‌వేశించి దాదాపు 9 ఏళ్లు పూర్త‌వుతున్నా.. ఇప్పుడే ఆమె సీమ‌లో ప‌ర్య‌టించ‌డం, సీమ వాసుల‌కు నీళ్లంద‌డం లేద‌ని సుదీర్ఘ మీడియా మీటింగ్‌లు పెట్ట‌డం.. అంతా చూస్తుంటే.. ఊర‌క‌రారు.. మ‌హానుభావులు.. అన్న వాక్యాలు గుర్తుకు రాక‌మాన‌వు.

2014కు ముందు వ‌ర‌కు కేంద్రంలో కాంగ్రెస్ మంత్రిగా ఉన్న పురందేశ్వ‌రి.. రాష్ట్ర విభ‌జ‌న‌తో బీజేపీ తీర్థం పుచ్చుకుని కండువా మార్చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక‌, ఇప్పుడు ఏపీలో బీజేపీని విస్త‌రించాల‌ని, 2019 నాటికి మంచి ఫామ్‌లోకి తీసుకురావాల‌ని క‌మ‌ల ద‌ళాధి ప‌తులు భారీ ల‌క్ష్యాల‌నే నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో కొంత ప‌స ఉన్న నేత‌ల‌కు పార్టీల‌కు అతీతంగా త‌మ గూటికి ఆహ్వానించి.. కాషాయ కండువా క‌ప్పే బాధ్య‌త‌ను రాష్ట్రంలోని ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్ల‌కు అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే పురందేశ్వ‌రి ఇప్పుడు ఎక్క‌డ అవ‌కాశం ఉండి, ఎవ‌రు త‌మ‌తో వ‌స్తారో చూసుకుని ఆదిశ‌గా అడుగులు వేస్తున్నార‌ట‌.

తాజాగా సీమ‌లో జెండా పీకేసిన రాయ‌ల‌సీమ ప‌రిర‌క్ష‌ణ స‌మితి అధ్య‌క్షుడు బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. ఏదో ఒక పార్టీలో త్వ‌ర‌లోనే చేర‌తాన‌ని హింట్ ఇచ్చాడు. ఈయ‌న‌కు పార్టీ ప‌రంగా ఎదురుగాలి వీచినా .. అభిమానులు, కోట‌రీ, కేడ‌ర్ మాత్రం బాగానే ఉంది. దీంతో పురందేశ్వ‌రి క‌న్ను బైరెడ్డిపై ప‌డింది. అయితే, వాస్త‌వానికి క‌ర్నూలులో కాట‌సారి రాం భూపాల రెడ్డి బీజేపీలో కీల‌కంగా ఉన్నారు.

అయినా కూడా బైరెడ్డిని ఆహ్వానించ‌డం ద్వారా ఈ జిల్లాలో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసి, అధిష్టానం వ‌ద్ద మార్కులు కొట్టేయాల‌ని పురందేశ్వ‌రి ప్లాన్ వేశారు. ఈ క్ర‌మంలోనే ఆమె సీమ‌లో ప‌ర్య‌టించి సిద్ధేశ్వరం, గుండ్రేవుల, ఆర్డీఎస్ ప్రాజెక్టుల‌ను సంద‌ర్శించారు. వాటిని బీజేపీ పూర్తి చేస్తుంద‌ని మీడియాకు చెప్ప‌డం ద్వారా సీమ‌లో క‌మ‌లం పార్టీని ప‌రుగులు పెట్టించాల‌నే ప్లాన్ సుస్ప‌ష్ట‌మైంది. మ‌రి బైరెడ్డి.. పురందేశ్వ‌రి వెంట న‌డుస్తారా? త‌న పాత పార్టీ సైకిల్ ఎక్కుతారా? చూడాలి.