టీఆర్ఎస్ స‌ర్కార్‌లో ఆ ఇద్ద‌రి కోల్డ్‌వార్‌

ఐఏఎస్‌.. ఐపీఎస్ ఉద్యోగులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మ‌ధ్య కొంత గ్యాప్ ఉంటుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే! ఇది అప్పుడ‌ప్పుడూ బ‌య‌ట‌ప‌డుతూనే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ‌లో ఈ గ్యాప్ మ‌రింత ఎక్కువ‌యింది. మొన్న‌టి వ‌ర‌కూ క‌లెక్ట‌ర్‌, ఎమ్మెల్యేల మ‌ధ్య కొన‌సాగిన‌ ఈ కోల్డ్ వార్‌.. సీఎంవో, మంత్రుల మ‌ధ్య మొద‌లైంది. సీఎంవోలోని కొంత‌మంది అధికారుల తీరుపై మంత్రులు, ఇత‌ర ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. తాము పంపించిన ఫైల్స్‌ను క్లియ‌ర్ చేయ‌కుండా ఎక్కువ కాలం త‌మ వ‌ద్దే ఉంచుకుంటున్నార‌ని, త‌మ మాట‌ను కూడా లెక్క చేయ‌డం లేద‌ని మండిప‌డుతున్నారు.

తెలంగాణ‌లో ప్ర‌జాప్రతినిధుల‌కు, బ్యూరోక్రాట్ల‌కు మ‌ధ్య దూరం పెరుగుతూ వ‌స్తోంది. పచ్చ‌గ‌డ్డి వేస్తే.. బ‌గ్గు మ‌నేంత‌గా వీరి మ‌ధ్య ప‌రిస్థితి మారింది. చినికి చినికి గాలివాన‌లా మొద‌లైన దుమారం.. ఇప్పుడు తుఫానులా మారిపోయింది. ఇప్ప‌టికే కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణాను బదిలీ చేశారు. మహబూబాబాద్ కలెక్టర్ వివాదం నడుస్తూనే ఉంది. ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ ప్రీతిమీనా మధ్య మాటలు లేవు. గతంలో కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గొడవకు దిగారు. జనగామ కలెక్టర్ దేవసేనపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మంత్రివర్గంలో కీలక మంత్రికి సీఎంవో అధికారులు ఇటీవల షాక్ ఇచ్చారు. ఒక కీలక ఫైలుకు సంబంధించి మంత్రి పంపిన ఫైలును.. రిజెక్ట్ చేసి పంపడంతో ఆయన ఫైరవుతున్నారు. నేతల ముఖ్యమైన పనులను చేసిపెడతారనే సీఎంఓ అధికారులకు సహజంగా ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం రివర్స్ అయింది. ప్రజాప్రతినిధులమైన తమను ఐఏఎస్ అధికారులు పట్టించుకో వడం లేదని ఎమ్మెల్యేలు, మంత్రులు వాపోతున్నారు. సీఎం పేషీలోని అధికారుల‌కు మంత్రులు ఫోన్ చేసినా వారు స్పందించకపోవడం, ఫైళ్లను వేగంగా క్లియరెన్స్ చేయకపోవడంతో పాటు ఏదో ఒక కొర్రీలు వేస్తున్నార‌ట‌.

ముఖ్యమంత్రి పేషీలో ముఖ్యకార్యదర్శి నర్సింగరావుతో పాటు మరో నలుగురు అధికారులున్నారు. శాంతికుమారి, స్మితా సబర్వాల్ లు కార్యదర్శుల హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక కార్యద ర్శులుగా కొనసాగుతున్నారు. వీరంతా ప్రగతి భవన్ లోనే ఉంటున్నారు. ముఖ్యమంత్రి ఫాం హౌస్ కు వెళ్లినా, ఢిల్లీ పర్యటనకు వెళ్లినా వీరు మాత్రం సచివాలయానికి రావడం లేదు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమైన పనుల కోసం వీరి మీద ఆధారపడాల్సి వస్తోంది. సీఎంఓలోని అధికారులపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసే ధైర్యం లేకపోవడంతో సమయం కోసం వేచి చూస్తున్నారు.