త‌మ్ముళ్లూ జాగ్ర‌త్త‌.. వాటితో టీడీపీ నేత‌ల బేజారు

మిగిలిన రాష్ట్రాల ప‌రిస్థితి ఏమో కానీ, ఏపీలో మాత్రం అధికార పార్టీ వినూత్న శైలిలో ముందుకు వెళ్తోంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు! అధికార పార్టీ ఎమ్మెల్యేల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వే చేయిస్తూ.. వారిలోపాల‌ను ఎండ‌గ‌డుతున్నారు టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు. అంతేకాదు, తీరు మార్చుకుంటేనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఇస్తామ‌ని ఖ‌రాఖండీగా చెబుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిల పనితీరే. ఎక్క‌డిక‌క్క‌డ నేత‌లు పైర‌వీల‌కు, చేతులు చాపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు త‌ప్ప‌… ప‌నులు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని బాబు నిర్వ‌హించిన సర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఈ ప‌రిణామం అటు పార్టీకి, ఇటు ప్ర‌భుత్వానికి కూడా ఇబ్బంది క‌రంగా మారింది.

అయితే, ప్ర‌స్తుతం నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు రాబ‌ట్ట‌డానికి కేవ‌లం బాబు ఇమేజ్ ఒక్క‌టే ప్రామాణికంగా మారింద‌ని కూడా ఈ స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి. దీంతో బాబు ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నాయి. అయితే, ఈ విధానం ఎంత మేర‌కు వ‌ర్క‌వుట్ అవుంతుంది? 2019లో ఎంత మేర‌కు ఫ‌లితం పాజిటివ్‌గా వ‌స్తుంది? అని బాబు ఆలోచిస్తున్నారు. తాను క‌ష్ట‌ప‌డుతూనే కేడ‌ర్ న‌డుం వంచేలా చేయాల‌ని డిసైడ్ అయ్యారు.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల నిర్వ‌హించిన పార్టీ వ‌ర్క్ షాపులో ఈ విష‌యాన్ని బాబు పార్టీ నేత‌ల‌కు కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. వెంట‌నే పద్దతి మార్చుకోవాలని, లేకుంటే కొత్తవారిని నియమించడం ఖాయమని హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్ర‌తి ఒక్క‌రూ సిద్ధంగా ఉండాల‌ని కూడా సూచించారు. గతంలో తన పనితీరుపై సానుకూలత వ్యక్తం అయింద‌ని, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిల పనితీరు సరిగా లేదని తాను చెప్పానని, అయినా ఎవ‌రూ ఖాతరు చేయటం లేదని దీనిని ఇలాగే కొన‌సాగిస్తే.. ప‌రిస్థితి తానే మారుస్తాన‌ని కూడా బాబు హెచ్చ‌రించారు.

2019లో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీకి నష్టం కలిగించే వారిని ఉపేక్షించేది లేద‌ని, తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే పార్టీ నాయకులకు, మంత్రులకే నష్టమని ఆయన అన్నారు. గెలుపు గుర్రాల‌కే ఛాన్స్ ఉంటుంద‌ని, మొత్తం 175 స్థానాల్లోనూ సైకిల్ జోరు సాగాల‌ని సూచించారు. దీంతో ఇప్పుడు త‌మ్ముళ్ల‌లో ఒకే ఆందోళ‌న చోటు చేసుకుంద‌ని తెలుస్తోంది. మ‌రి బాబు సూచ‌న‌లు, హెచ్చ‌రిక‌లు, ఎంత మేర‌కు ప‌నిచే్స్తాయో చూడాలి.