20 రోజులు జ‌గ‌న్ ఫ్యామిలీ అడ్ర‌స్ చేంజ్‌

క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో వైసీపీ క్ర‌మ‌క్ర‌మంగా ప‌ట్టు బిగిస్తోంది. గ‌త వారం రోజులుగా ఇక్క‌డ ఎవ‌రో ఒక‌రు ప్ర‌ముక వ్య‌క్తి వైసీపీలో చేరుతూనే ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సంజీవ‌రెడ్డి, నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రాకేశ్‌రెడ్డి, టీడీపీ కార్పొరేట‌ర్ హ‌నీఫ్‌, నిన్న తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి వైసీపీలోకి జంప్ చేసేస్తున్నారు. ఇక్క‌డ ఎన్నిక 2019 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు సెమీఫైన‌ల్‌గా అంద‌రూ భావిస్తుండ‌డంతో జ‌గ‌న్ కూడా ఇక్క‌డ చావో రేవో తేల్చుకునేందుకు రెడీగానే ఉన్నాడు.

ఈ క్ర‌మంలోనే ఇక్కడ గెలుపు కోసం జ‌గ‌న్ ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు ప‌న్నుతున్నాడో కూడా ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. నంద్యాల‌లో ఈ రోజు జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ఉంది. ఈ ప‌ర్య‌ట‌న స‌క్సెస్ చేసేందుకు ఆ పార్టీ నేత‌లు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఇప్ప‌టికే ఇక్క‌డ చంద్ర‌బాబు సీఎం హోదాలో రెండుసార్లు ప‌ర్య‌టించి కోట్లాది రూపాయ‌ల అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు చేశారు.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఇక్క‌డ జ‌గ‌న్ ప్ర‌చారానికి అస్త్ర‌శ‌స్త్రాల‌తో దిగుతున్నాడు. టీడీపీలో ఉప ఎన్నిక వేళ ఎన్నో అసంతృప్తులు బ‌య‌ట‌ప‌డుతున్నా జ‌గ‌న్ మాత్రం త‌మ పార్టీ నుంచి ఎలాంటి అసంతృప్తులు లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా నిన్న‌టి వ‌ర‌కు ఉన్న రాజ్‌గోపాల్‌రెడ్డితో పాటు గంగుల ప్ర‌తాప్‌రెడ్డిని ముందుగానే బుజ్జ‌గించారు.

ఇక ఉప ఎన్నిక ప్ర‌చారం ముగిసేవ‌ర‌కు టోట‌ల్ జ‌గ‌న్ ఫ్యామిలీ కేరాఫ్ నంద్యాలే కానుంది. జ‌గ‌న్ ఇప్పుడు మూడు రోజుల పాటు ఇక్క‌డే మకాం వేస్తున్నారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి, సోద‌రి ష‌ర్మిల కూడా ఇక్క‌డ వారం రోజుల పాటు ప్ర‌చారంలో పాల్గొంటార‌ని స‌మాచారం. వారు వెళ్లాక మ‌ళ్లీ ప్ర‌చారం చివ‌రి రోజుల్లో జగ‌న్ వ‌చ్చేలా ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక వీరికి తోడుగా వైసీపీ నుంచి ఇప్ప‌టికే 14 మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధ‌ర్మాన ప్రసాదరావు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డితో పాటు మ‌కాం వేసేశారు. ఏదేమైనా నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలుపుకోసం జ‌గ‌న్ వేస్తోన్న ప్లాన్లు అధికార టీడీపీకి మాత్రం ముచ్చెమ‌ట‌లు పట్టిస్తున్నాయి.