ప్ర‌కాశం టీడీపీలో ఫ‌స్ట్ వికెట్ డౌన్‌.. లైన్లో 2, 3 వికెట్లు

ప్ర‌కాశం జిల్లాలో కొంత‌మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినా క్షేత్ర‌స్థాయిలో మాత్రం వైసీపీ బ‌లంగానే ఉంది. ఇక్క‌డ చంద్ర‌బాబు ఫిరాయింపుల‌తో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకుని టీడీపీని చేజేతులా నాశ‌నం చేసేశారు. విప‌క్ష వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోను పార్టీ రెండు గ్రూపులుగా నిలువునా చీలిపోయింది.

ఈ క్ర‌మంలోనే కొద్ది రోజులుగా జిల్లాలో నివురు గ‌ప్పినా నిప్పులా ఉన్న అసంతృప్తి అన్నా రాంబాబు రూపంలో ఫ‌స్ట్ వికెట్ రూపంలో ప‌డిపోయింది. అద్దంకిలో గొట్టిపాటి ర‌వికుమార్ ఎంట్రీతో క‌ర‌ణం బ‌ల‌రాంకు ర‌వికి ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే ఎలా భ‌గ్గుమంటోందో ? చూస్తూనే ఉన్నాం. ఇక కందుకూరులో పోతుల రామారావు పార్టీలోకి రావ‌డంతో అక్క‌డ టీడీపీ సీనియ‌ర్ నేత దివి శివ‌రాంకు ఆయ‌న‌కు అస్స‌లు పొస‌గ‌డం లేదు. ఇటీవ‌ల ఆయ‌న బ‌ర్త్ డే వేడుక‌ల్లో టీడీపీలో ఇదే త‌న‌కు చివ‌రి పుట్టిన రోజు అని కూడా వ్యాఖ్యానించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

ఇక గిద్ద‌లూరులో ముత్తుముల అశోక్‌రెడ్డి టీడీపీలో చేర‌డంతో అక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అన్నా రాంబాబు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కొద్ది రోజులుగా అక్క‌డ అశోక్ వ‌ర్సెస్ రాంబాబు మ‌ధ్య జ‌రుగుతోన్న వ‌ర్గ‌పోరుతో టీడీపీ తీవ్రంగా న‌ష్ట‌పోతోంది. తాజాగా ఈ రోజు రాంబాబు టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.

ఈ రోజు నిర్వ‌హించిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయ‌న తీవ్రంగా ఆవేద‌న వ్యక్తం చేశారు. టీడీపీలో కొనసాగితే నాకు సిగ్గు లేనట్లేనని వ్యాఖ్యానించారు. కార్యకర్తల సమావేశంలోనే రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన అన్నా రాంబాబు ., పార్టీ కండువా మెడలోనుంచి తీసేసి కిందపడేశారు.

2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాంబాబు, 2014 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే అక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో రాంబాబు మీద గెలిచిన అశోక్‌రెడ్డిని టీడీపీలో చేర్చుకున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అశోక్‌రెడ్డికి టీడీపీ టిక్కెట్ దాదాపుగా ఖ‌రారు కావ‌డంతో చివ‌ర‌కు అశోక్‌రెడ్డి టీడీపీని వీడారు. ఇక రాంబాబు పార్టీ వీడ‌డం ప్రకాశం జిల్లా టీడీపీలో పెద్ద కుదుపు కాగా ఈ జిల్లాలో త‌ర్వాత క‌ర‌ణం బ‌ల‌రాంతో పాటు దివి శివ‌రాం కూడా వైసీపీలో చేరిపోతార‌ని తెలుస్తోంది.