నంద్యాల‌లో ప‌వ‌న్ ఎన్ని ఓట్ల‌ను ప్ర‌భావితం చేస్తాడు…!

`నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌నే అంశంపై రెండు రోజుల్లో అభిప్రాయాన్ని ప్ర‌క‌టిస్తా` అని జ‌న‌సేన అధినేత పవ‌న్ క‌ల్యాణ్ చెప్పిన నాటి నుంచి అందరిలోనూ ఒక‌టే చర్చ‌! ప‌వ‌న్ ఎన్ని ఓట్లు ప్ర‌భావితం చేస్తాడు? ఏఏ వ‌ర్గాల ఓట్ల‌ను త‌నవైపు తిప్పుకోగ‌లుగుతాడు? ఎవ‌రికి ఇది ప్ల‌స్? ఎవ‌రికి మైన‌స్‌? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప‌వ‌న్ నిర్ణ‌యంపై అటు టీడీపీ, వైసీపీతో పాటు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కూడా ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో సామాజికవర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకోవడానికి టీడీపీ, వైసీపీలు పావులు కదుపుతున్నాయి.

నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ, వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. గెలుపే లక్ష్యంగా ఇరుపార్టీల నాయకులు వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. నంద్యాలలోని నంద్యాల అర్బన్‌, నంద్యాల రూరల్‌, గోస్పాడు మండలంలో జనసేన సేవాదళ్‌ క్రియాశీలక సభ్యత్వం 4 వేల మంది తీసుకున్నారు. వీరు కాక పవన్‌ బాటన నడిచేందుకు ఆ సామాజికవర్గానికి చెందిన 25 వేల నుంచి 35 వేల మంది అభిమానులు, సేవాదళ్‌ సాధా రణ కార్యకర్తలు, పవన్‌ కల్యాణ్‌ ఆశయ సాధన సమితి సభ్యులు ఉన్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇప్పటికే పవన్‌ పవన్‌ అభిమా నులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రధాన పార్టీలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మిత్రపక్షాలుగా పోటీ చేశాయి. ఈ ఉప ఎన్నికలో పవన్‌ మద్దతు తమకే ప్రకటిస్తారని అధికారపార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో పవన్‌ తీసుకునే నిర్ణయం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతా యోనని వైసీపీ అంచనా వేస్తోంది. పవన్‌ టీడీపీకి మద్దతు ఇస్తే ఏఏ సామాజికవర్గాల్లో తమకు నష్టం వాటిల్లుతుందో.. ఆ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలోనని వైసీపీ నాయకులు వ్యూహాత్మక ఎత్తులు వేస్తున్నారు. పవన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సహకరించాలని ఆయన అభిమాను లను వారు కోరినట్లు సమాచారం.

నంద్యాల నియోజకవర్గంలో 2,09,612 మంది ఓటర్లు ఉన్నారు. ముస్లింలు, బలిజలు, ఆర్యవైశ్యులు, రెడ్లు, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఉన్నారు. బలిజ ఓటర్లు దాదాపు 42 వేలు ఉంటారని అంచనా. దీంతో పవన్‌ తీసుకునే నిర్ణయం బలిజ ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ సామాజికవర్గం అధికార పక్షానికి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీకి పవన్‌ మద్దతిస్తే బలిజ ఓటర్లు ఆ పార్టీకి మరింత పెరిగే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌తో త‌మ‌ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా అవినాభావ సంబంధాలు ఉన్నాయ‌ని పవన్‌ అభిమానులు, జనసేన పార్టీ సేవాదళ్‌ కార్యకర్తలు సహకరిస్తారని మంత్రి అఖిల‌ప్రియ‌ ఆశాభావం వ్య‌క్తంచేస్తున్నారు.