నంద్యాల‌లో టీడీపీ అల్లుడు వ‌ర్సెస్ వైసీపీ మామ‌

ఏపీలో ఇప్ప‌టికే హైటెన్ష‌న్‌గా మారిన క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌ల్లో ట్విస్టులు అదిరిపోతున్నాయి. గ‌త వారం రోజులుగా న‌లుగురు కీల‌క వ్య‌క్తులు ఇత‌ర పార్టీల నుంచి టీడీపీలోకి జంప్ చేయ‌డం, ఇక్క‌డ ఇటీవ‌ల కాలంలోనే సీఎం చంద్ర‌బాబు రెండుసార్లు ప‌ర్య‌టించ‌డం, ఇక ఇక్క‌డ ప్ర‌చారానికి వైసీపీ అధినేత జ‌గ‌న్‌, ష‌ర్మిల‌, విజ‌య‌ల‌క్ష్మితో పాటు టీడీపీ నుంచి బ్రాహ్మ‌ణి లాంటి వాళ్లు ప్ర‌చారానికి వ‌స్తుండ‌డంతో ఇప్ప‌టికే ఇక్క‌డ రాజ‌కీయం అదిరిపోతోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఇక్క‌డ టీడీపీ అల్లుడు వ‌ర్సెస్ వైసీపీ మామ మ‌ధ్య వార్ జ‌ర‌గుతోంది. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తోన్న భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, బ‌న‌గాన‌ప‌ల్లి వైసీపీ ఇన్‌చార్జ్ కాట‌సాని రామిరెడ్డికి స్వ‌యానా అల్లుడు. రామిరెడ్డి కుమార్తెనే బ్ర‌హ్మానంద‌రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే కాట‌సాని ముందుగా నంద్యాల ఉప ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేసేందుకు ప్ర‌య‌త్నించారు.

కాట‌సాని ఏక‌గ్రీవం వార్త‌ల‌ను ప‌దే ప‌దే తేవ‌డంతో జ‌గ‌న్ ఆయ‌న‌కు క్లాస్ తీసుకున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న వైసీపీ తరుపున రాజగోపాల్ రెడ్డి బరిలో ఉంటారని మొదటి నుంచి చెబుతూ వచ్చారు కానీ శిల్పా మోహన్ రెడ్డి రాకతో సీన్ రివర్స్ అయింది. శిల్పా మోహన్‌రెడ్డిని నంద్యాల ఉపఎన్నిక అభ్యర్థిగా జగన్ ప్రకటించడంతో కాటసాని ఖంగు తిన్నారు.

ఇక ఇప్పుడు పార్టీ నిర్ణ‌యం మేర‌కు అల్లుడు బ్ర‌హ్మానంద‌రెడ్డికి యాంటీగా వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్‌రెడ్డికి ప్ర‌చారం చేయాలా ? వ‌ద్దా ? అన్న‌ది తేల్చుకోలేక‌పోతున్నార‌ట‌. ప్ర‌స్తుతానికి అయితే ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఎక్క‌డా క‌న‌ప‌డ‌డం లేదు. తన కుమార్తె కోరిక మేరకు అల్లుడు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి కాటసాని మద్దతు తెలుపుతున్నట్టు సమాచారం.

అయితే జ‌గ‌న్ నంద్యాల ప‌ర్య‌ట‌న‌లో కాట‌సాని ఉంటార‌ని, ఆయ‌న వైసీపీ త‌ర‌పునే ప్ర‌చారం చేస్తార‌ని వైసీపీ వాళ్లు చెపుతున్నారు. కాట‌సాని వైసీపీ త‌ర‌పున ప్ర‌చారంలోకి దిగితే నంద్యాల‌లో టీడీపీ అల్లుడు వ‌ర్సెస్ వైసీపీ మామ మ‌ధ్య వార్ భ‌లేగుంటుందిలే.