ఆమ్ర‌పాలి ఓ యూత్ ఐకాన్‌… ఏం చేసినా అంత క్రేజ్ ఏంటో

ఆమ్ర‌పాలి.. ఆమ్ర‌పాలి.. ఇప్పుడు ఈ పేరు సోష‌ల్ మీడియాలో మారుమోగుతోంది. ఏకంగా ఆమ్ర‌పాలి చేతిలో వినాయ‌కుడిని పెట్టిన‌ట్లు ఉండే విగ్ర‌హం ప్ర‌తిష్ఠించారంటే.. అర్థం చేసుకోవ‌చ్చు ఆమె ఎంత‌టి పాపులరో! ఇలాంటి వ‌న్నీ ఎక్క‌డో త‌మిళ‌నాడులో చూస్తుంటాం. సినీ న‌టులకో, రాజ‌కీయ నాయ‌కుల‌కో ఇలాంటివి చేశార‌ని వింటుంటాం! కానీ ఆమె వీట‌న్నింటికీ అతీతం. ఆమె ఒక యూత్ ఐకాన్‌! ఆమె చీర కట్టినా న్యూసే.. మోడ్ర‌న్ డ్రెస్ వేసినా న్యూసే!! అన‌తి కాలంలోనే ఆమె ఇంత పాపుల‌ర్ అవ‌డానికి కార‌ణ‌మేంటి? అంటే ఆమె ఆటిట్యూడ్ అనే చెప్పుకోవాలి. క‌లెక్ట‌ర్‌గానే ఆమె తెలిసినా.. ఆమె గురించి ఇంకా తెలియ‌ని విష‌యాలు ఎన్నో ఉన్నాయి.

ఆమె వ‌స్త్రధార‌ణ సంప్ర‌దాయ రాజ‌కీయ‌నాయ‌కులకు న‌చ్చ‌దు. ఆమె దూకుడు.. యువ‌త‌కు ఆద‌ర్శం! ఆమె ప్ర‌సంగాలు స్ఫూర్తి నింపుతాయి! ఆమె నిర్ణ‌యాలు ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేలా ఉంటాయి! అందుకే ఆమె యూత్ ఐకాన్ అయిపోయారు. ఒక సాధార‌ణ క‌లెక్ట‌ర్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పాపులారిటీ రావ‌డం.. అంద‌రినీ ఆశ్చర్య‌ప‌ర‌చ‌క మాన‌దు. బాహుబలి సినిమా కు ఏకంగా థియేట‌ర్‌నే బుక్ చేసి.. లైమ్‌లైట్లోకి వ‌చ్చారు ఆమ్ర‌పాలి. ఇంత‌కీ ఆమెది ఏ ప్రాంతం.. నార్త్ చెందిన ఆమె అయిఉంటుంది.. అందుకే అంత మోడ్ర‌న్గా ఉంటున్నార‌ని అనుకునే వాళ్లు లేక‌పోలేదు. కానీ ఆమెది ఏపీ.. అందులోనూ విశాఖ అంటే ఆశ్చ‌ర్యంగానే ఉంటుంది.

ఆమ్ర‌పాలి 1982లో జ‌న్మించింది. ఆమె తండ్రి రిటైర్డ్ ఎక‌నామిక్స్ ప్రొఫెస‌ర్! ఆమె చదువంతా వైజాగ్‌లోనే జ‌రిగింది. ఐఐటీ మ‌ద్రాస్‌లో ఇంజ‌నీరింగ్ త‌ర్వాత‌.. బెంగ‌ళూరు ఐఐఎంలో ఎంబీఏ చేశారు. యూపీఎస్సీ 39వ ర్యాంకు సాధించారు. ఐఏఎస్‌కు ఎంపికైన అతి కొద్ది మంది పిన్న‌వ‌య‌స్కుల్లో ఆమె కూడా ఒక‌రు! ఆమె త‌ర్వాత ఏపీ కేడ‌ర్‌ను ఎంచుకున్నారు. వికార‌బాద్ స‌బ్ క‌లెక్ట‌ర్‌గా పోస్టింగు త‌ర్వాత స్త్రీ శిశు సంక్షేమ శాఖ‌లో కొలువు! 2015లో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్ట‌ర్‌గా ఎంపిక‌య్యారు.

2016లో తెలంగాణ‌లో కొత్త జిల్లాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగిన‌ప్పుడు చాలా మంది యువ ఐఏఎస్‌ల‌కు క‌లెక్ట‌ర్‌గా ప్ర‌మోష‌న్ వ‌చ్చింది. ఇందులో ఆమ్ర‌పాలి కూడా ఉన్నారు. వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌ర్‌గా నియ‌మితుల‌య్యారు! అప్ప‌టినుంచి ఇప్ప‌టి వర‌కూ ఆమె త‌న‌దైన శైలితో దూసుకుపోతున్నారు. క‌లెక్ట‌ర్లు ఇలానే ఉండాలి అనే నిబంధ‌న‌ల‌ను ఆమె బ్రేక్ చేశారు. అందుకే ఆమె అంద‌రికీ ఐకాన్‌గా మారిపోయారు. ఇంత చేసినా విధుల్లో ఎప్పుడూ నిర్లక్ష్యం వ‌హించింది లేదు.