టీడీపీకి ఓట్లు వేయం…ఇది వారి మాట!

ఏపీలోని నంద్యాల ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేష‌న్ రాకుండానే అక్క‌డ పొలిటిక‌ల్ హీట్ పెరిగిపోయింది. టీడీపీ త‌ర‌పున భూమా నాగిరెడ్డి అన్న కొడుకు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, వైసీపీ నుంచి మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి పోటీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి బ్ర‌హ్మానంద‌రెడ్డి నోటిఫికేష‌న్ రాకుండానే ఎన్నికల ప్ర‌చారం స్టార్ట్ చేసేశాడు.

మంత్రి అఖిల‌ప్రియ‌కు సైతం త‌న సోద‌రుడు బ్ర‌హ్మానంద‌రెడ్డిని గెలిపించుకోవ‌డం క‌ఠిన‌ప‌రీక్ష‌గా మారింది. దీంతో ఆమె సోద‌రుడిని వెంట‌పెట్టుకుని ఆశీర్వాద యాత్ర పేరుతో నంద్యాల ప‌ట్ట‌నంలో ప్ర‌చారం స్టార్ట్ చేశారు. ప్రత్యేకించి నియోజకవర్గంలో మెజారిటీ ఓట్లు ఉన్న నంద్యాల పట్టణంలో వారు ఏ ఒక్క వీధిని కూడా వదలకుండా వీరు చుట్టేస్తున్నారు.

పైకి ఇది బ్ర‌హ్మానంద‌రెడ్డికి ప‌రిచ‌య‌యాత్ర‌గాను, ఆశీర్వాద యాత్ర‌గాను క‌నిపిస్తున్నా ఉప ఎన్నికల్లో త‌మ‌కు ఓట్లేసి గెలిపించాల‌ని వీరు ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారు. ఈ యాత్రలో వీరికి జ‌నాలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. చాలా మంది మీరు మాకు ఏం చేశారు ? మీకు ఎందుకు ఓట్లేయాల‌ని నిల‌దీస్తున్నారు. కొంద‌రు మ‌హిళ‌లు స్థానిక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించి అఖిల‌, బ్ర‌హ్మానంద‌రెడ్డిల‌ను ఇరుకున పెడుతున్నారు.

కొంద‌రు మ‌హిళ‌లు ఫించ‌న్ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. 70 ఏళ్ల మ‌హిళ అయితే త‌న‌కు ఇప్పటికీ పింఛన్ రాలేదని పింఛన్ ఇవ్వని టీడీపీకి తాను ఓటు ఎందుకు వేస్తానని కూడా ఆమె బ్రహ్మానందరెడ్డి ముఖం మీదే చెప్పిందట. దీంతో అసలు ఆమెకు ఏం సమాధానం చెప్పాలో కూడా బ్రహ్మానందరెడ్డికి అర్థం కాలేదట. ఏదేమైనా నంద్యాల‌లో గెలుపు టీడీపీకి అంత వీజీ కాద‌ని అర్థ‌మ‌వుతోంది.