మ‌హిళా సాధికార‌త‌లో బాబు వెనుక‌డుగే

మ‌హిళా సాధికార‌త‌, మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ల‌కు ఎప్పుడూ క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతుంటారు. మొన్న‌టికి మొన్న ఉమెన్స్ పార్ల‌మెంట్ ఘ‌నంగా నిర్వహించి.. మ‌హిళ‌ల‌కు అత్యంత గౌర‌వం ఇస్తున్నామ‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.ఇదంతా నాణేనికి ఒక‌వైపు! మ‌రోవైపు.. సొంత పార్టీ ఎమ్మెల్యే మ‌హిళా అధికారిపై చేయిచేసుకున్నా.. సొంత పార్టీ ఎమ్మెల్యేను వెన‌కేసుకొచ్చారు త‌ప్ప‌.. ఆమెకు క్ష‌మాప‌ణ‌లే చెప్పించ‌లేదు. కానీ ఇప్పుడు ఒక మ‌హిళా అధికారిణితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఎమ్మెల్యేతో.. ఆమెకు క్ష‌మాప‌ణ‌లు చెప్పించి.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. ఇప్పుడు బాబు కంటే కేసీఆర్ బెట‌ర‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో కేసీఆర్ ప్ర‌భుత్వం.. హ‌రిత హారం కార్య‌క్ర‌మాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న విషయం తెలిసిందే! ఇందులో భాగంగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో జ‌రిగిన సంఘ‌ట‌న ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఇందులో భాగంగా.. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ క‌లెక్ట‌ర్ ప్రీతిమీనాపై మ‌హ‌బూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంక‌ర్ నాయ‌క్.. ఆమెతో అనుచితంగా వ్య‌వ‌హ‌రించారు. క‌లెక్ట‌ర్, మ‌హిళ‌నైన త‌న‌ను చేతితో తాకాల్సిన అవ‌స‌రం ఏమిటంటూ ఆమె ఆగ్ర‌హించారు. దీనిపై క‌లెక్ట‌ర్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్పీ సింగ్‌కు ఫిర్యాదుచేయ‌డం.. అసోసి యేష‌న్ త‌ర‌ఫున వివిధ శాఖ‌ల ముఖ్య‌కార్య‌ద‌ర్శులు సీఎస్‌ను క‌ల‌వ‌డం, ఈ విష‌యం సీఎం కేసీఆర్ వ‌ర‌కు చేరింది.

క‌లెక్ట‌ర్‌పై దురుసుగా వ్య‌వ‌హ‌రించిన ఎమ్మెల్యేపై సీఎం కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేయ‌డం.. క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, ప్ర‌వ‌ర్త‌న మార్చుకోక‌పోతే స‌స్పెండ్ చేస్తామ‌ని హెచ్చ‌రించారు. దీంతో ఎమ్మెల్యే బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పారు. ఇటువంటి ఘ‌ట‌న‌లో ఇరు రాష్ట్రాల సీఎంలు వ్య‌వ‌హ‌రించిన తీరుపై ఇప్పుడు విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఏపీలో ఇసుక అక్ర‌మ ర‌వాణా ఎమ్మెల్యే అనుచ‌రులే చేస్తున్నారన్న విష‌యం తెలుసుకున్న ఎమ్మార్వో వ‌న‌జాక్షి వాటిని అడ్డుకున్న విష‌యం తెలిసిందే! ఇది తెలుసుకున్న‌ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. అక్క‌డకు చేరుకుని ఆమెను దుర్భాష‌లాడి. దాడి చేశారు. దీనిపై ఆమె నిర‌స‌న వ్య‌క్తంచేయ‌డం.. సీఎంకు ఫిర్యాదుచేయ‌డం జ‌రిగాయి.

అయితే దీనిపై చంద్ర‌బాబు మాత్రం నోరుమెద‌ప‌లేదు. పైగా ఎమ్మెల్యేను వెన‌కేసుకొచ్చారు. ఈ విష‌యంలో ఎమ్మెల్యేపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసినా.. చివ‌ర‌కు వ‌న‌జాక్షికి న్యాయం జ‌ర‌గ‌లేదు. దీంతో తెలంగాణ‌లో క‌లెక్ట‌ర్‌కు ఎమ్మెల్యేతో క్ష‌మాప‌ణ‌లు చెప్పించారు కేసీఆర్‌! మ‌హిళా సాధికార‌త‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెబుతున్న చంద్ర‌బాబు.. మాట‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యార‌ని రాజ‌కీయవ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విష‌యంలో బాబు కంటే కేసీఆర్ మిన్న అని విశ్లేష‌కులు చెబుతున్నారు.