టీడీపీ కంచుకోటలో ఐదుగురు కొత్త ఎమ్మెల్యేలు

ఏపీలో ప్ర‌స్తుతం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌, పెంపు అంశం రాజ‌కీయంగా మంచి హాట్ టాపిక్‌గా మారింది. ఏయే జిల్లాల్లో ఏయే కొత్త నియోజ‌క‌వ‌ర్గాలు పెరుగుతాయి ? ప‌్ర‌స్తుతం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల రూపు రేఖ‌లు ఎలా మ‌ర‌తాయి ? అన్న అంశంపై ఎవ‌రి లెక్క‌ల్లో వారు మునిగి తేలుతున్నారు. ఇక ప‌శ్చిమ‌గోదావ‌రి పేరు చెపితే అధికార టీడీపీకి కంచుకోట అన్న సంగ‌తి తెలిసిందే. ఆ పార్టీ ఆవిర్భ‌వించిన‌ప్ప‌టి నుంచి జ‌రిగిన చాలా ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీదే పైచేయి అయ్యింది.

ఇక నియోజ‌క‌వ‌ర్గాల పెంపు జ‌రిగితే జిల్లాలో మొత్తం 5 కొత్త నియోజ‌క‌వ‌ర్గాలు ఏర్ప‌డ‌నున్నాయి. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో కేంద్రం జిల్లా యూనిట్‌గా కాకుండా లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా యూనిట్‌గా చేసి పెంపు చేప‌ట్టాల‌ని డెసిష‌న్ తీసుకుంది. ఈ నిర్ణ‌యం అమ‌లైతే ప్ర‌స్తుతం ఒక్కో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు 9కు పెరుగుతాయి. ఈ లెక్క‌న ప‌శ్చిమ‌లో ఏలూరు, న‌ర‌సాపురం లోక్‌స‌భ స్థానాలు పూర్తిగాను, రాజ‌మండ్రి లోక్‌స‌భ స్థానం పాక్షికంగాను ఉంది.

2009 ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన పున‌ర్విభ‌జ‌న‌లో డెల్టాలోని అత్తిలి, పెనుగొండ స్థానాలు ర‌ద్ద‌య్యాయి. వాటి స్థానంలో కొత్త‌గా నిడ‌ద‌వోలు నియోజ‌క‌వ‌ర్గం వ‌చ్చింది. ఇక ఇప్పుడు లోక్‌స‌భ సీటును యూనిట్‌గా తీసుకుంటే ఏలూరు లోక్‌స‌భ సీటు ప‌రిధిలో కొత్త‌గా ఏలూరు రూర‌ల్‌తో పాటు న‌గ‌ర పంచాయితీగా మారిన జంగారెడ్డిగూడెం కేంద్రంగా రెండు అసెంబ్లీ సీట్లు పెర‌గ‌నున్నాయి. జిల్లాలో తెలంగాణ నుంచి క‌లిసిన కుక్కునూరు, వేలేరుపాడు మండ‌లాల‌ను పోల‌వ‌రం, చింత‌ల‌పూడి సీట్ల‌లో స‌ర్దుబాటు చేయ‌నున్నారు.

ఇక జిల్లా కేంద్రం, కార్పొరేష‌న్‌గా ఉన్న ఏలూరు న‌గ‌రం ఓ నియోజ‌క‌వ‌ర్గ‌మైతే ఏలూరు రూర‌ల్ మండ‌లంతో పాటు దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలోని కొన్ని మండ‌లాలు / గ‌్రామాల‌తో కొత్త‌గా ఏలూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డ‌నుంది. ఇక న‌రసాపురం లోక్‌స‌భ సీటులో గ‌తంలో ర‌ద్ద‌యిన అత్తిలి, పెనుగొండ‌లో ఓ సీటుతో పాటు కొత్త‌గా భీమ‌వ‌రం రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం రానున్న‌ట్టు తెలుస్తోంది. భీమ‌వ‌రం అర్బ‌న్ ఓ నియోజ‌క‌వ‌ర్గంగాను, భీమ‌వ‌రం రూర‌ల్ మండ‌లంతో పాటు ఉండి నియోజ‌క‌వ‌ర్గంలోని కొన్ని గ్రామాలు, వీర‌స‌వాస‌రం మండ‌లంలోని కొన్ని గ్రామాల‌తో భీమ‌వ‌రం రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం రానుంది.

ఇక రాజ‌మండ్రి లోక్‌స‌భ సీటు ప‌రిధిలో ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రంగా ఉన్న ద్వార‌కాతిరుమ‌ల, న‌ల్ల‌జ‌ర్ల మండ‌లాల‌తో పాటు దేవ‌ర‌ప‌ల్లి మండ‌లంలోని కొన్ని గ్రామాల‌తో కొత్త నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డ‌నుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి న‌ల్ల‌జ‌ర్ల లేదా ద్వార‌కాతిరుమ‌ల కేంద్రం కానుంది. జిల్లాలో ప్ర‌స్తుతం ఉన్న 16 అసెంబ్లీ సీట్ల‌కు తోడుగా కొత్త‌గా ఐదు నియోజ‌క‌వ‌ర్గాలు రానుండ‌డంతో ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌తో పాటు చాలా మంది ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.