ఏపీ,తెలంగాణ లో అధికారమే ధ్యేయంగా పావులు కదుపుతున్న బీజేపీ?

ఏపీలో టీడీపీని ప‌క్క‌న పెట్టేసి నెమ్మ‌ది నెమ్మ‌దిగా ఎదిగేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఓ వైపు టీడీపీతో స్నేహం చేస్తూనే చాప‌కింద నీరులా టీడీపీకి ఎర్త్ పెట్టే ప్ర‌య‌త్నాలు బీజేపీ నుంచి జ‌రుగుతున్నాయి. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే బీజేపీ టీడీపీ నుంచి చాలా ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాల‌న్న టార్గెట్ పెట్టుకుంది. 8-10 ఎంపీ సీట్ల‌తో పాటు 50 ఎమ్మెల్యే సీట్లు అడ‌గాల‌న్న ప్లాన్‌లో ఏపీ బీజేపీ నేత‌లు ఉన్నారు. 

ఇక వెంక‌య్య అడ్డం తొల‌గ‌డంతో ఏపీ బీజేపీ రిమోట్ ఇప్పుడు ఆ పార్టీ జాతీయనేత రాం మాధ‌వ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు రాం మాధ‌వ్ ఇక్కడ ఏపీ బీజేపీలో వెంక‌య్య గ్యాంగ్‌ను క్ర‌మ‌క్ర‌మంగా ప‌క్క‌కు త‌ప్పించే ప్ర‌య‌త్నాలు ఓ వైపు స్టార్ట్ చేసేశారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న వెంక‌య్య మ‌నిషి, విశాఖ ఎంపీ కంభంపాటి హ‌రిబాబును త‌ప్పించేసి, ఆయన ప్లేస్‌లో ఎమ్మెల్సీ సోము వీర్రాజును కూర్చోపెట్టే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాల‌ని భావిస్తోన్న బీజేపీ అవ‌స‌ర‌మైతే టీడీపీతో తెగ‌తెంపులు చేసుకునే ప్ర‌య‌త్నాలు కూడా చేస్తోంది. ఈ రెండు పార్టీల మ‌ధ్య తేడా వ‌స్తే స‌ర్దుకునేందుకు అక్క‌డ వెంక‌య్య లేడుగా…ఇప్పుడున్న ఏపీ బీజేపీ నేత‌లు ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ఏదైనా చేస్తారు. 

ఇక 2019లో కాక‌పోయినా 2024లో అయినా ఏపీ, తెలంగాణ‌లో ఒంట‌రిగా అధికారంలోకి రావ‌డ‌మే ధ్యేయంగా బీజేపీ పావులు క‌దుపుతోంది. రాం మాధ‌వ్ వ‌రంగ‌ల్‌లో చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌నం. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీతో పొత్తు ఉన్నా లేక‌పోయినా రాం మాధ‌వ్ లోక్‌స‌భ‌కు పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

రాం మాధ‌వ్ తూర్పుగోదావ‌రి జిల్లాలోని అమ‌లాపురంకు చెందిన వారు. దీంతో రాం మాధ‌వ్ అదే జిల్లాలోని రాజ‌మండ్రి లేదా కాకినాడ నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేస్తార‌ని టాక్‌. టీడీపీ+బీజేపీ క‌లిసి పోటీ చేసినా లేదా విడివిడిగా పోటీ చేసినా రాం మాధ‌వ్ ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి బీజేపీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. మ‌రి రాం మాధ‌వ్ హ‌వా ఏపీ బీజేపీలో స్టార్ట్ అయిన‌ట్టే క‌న‌ప‌డుతోంది.