టీవీ 9 బ్రాండ్ వాల్యూ తెలిస్తే షాకే!

తెలుగు టెలివిజ‌న్ రంగంలో సంచ‌ల‌నం టీవీ9! అప్ప‌టివ‌ర‌కూ ఉన్న సంస్కృతికి భిన్నంగా నిరంతరం వార్త‌లు అందిస్తూ.. టీవీ గ‌తిని మార్చిన చాన‌ల్ ఇది! బ్రేకింగ్ న్యూస్‌ల‌తో అక్ర‌మార్కులను ప‌రుగులెత్తించిన చానెల్‌! తెలుగులోనే మొదలై.. ఇత‌ర భాష‌ల‌కు విస్త‌రించి ఇంతింతై వటుడింతై అన్న చందంగా మారిపోయింది. టీవీ9 యాజ‌మాన్యం మారబోతోంద‌ని, దీనికి అమ్మ‌కానికి పెట్టార‌న్న ఊహాగానాలు కొన్ని రోజుల నుంచి వినిపిస్తూ వ‌స్తున్నాయి. అయితే ఇవి వాస్త‌వేమని బిజినెస్ వ‌ర్గాలు స్ప‌ష్టంచేస్తున్నాయి. దీనిని చేజిక్కించుకునేందుకు నాలుగు బ‌డా కంపెనీలు పోటీలో ఉన్నాయి. మ‌రో విష‌య‌మేంటంటే.. ఇప్పుడు టీవీ9 బ్రాండ్ వాల్యూ తెలిస్తే తప్ప‌క షాక్‌కు గురికావాల్సిందే!!

ఇటీవ‌ల తెలుగు న్యూస్ చానెల్స్ అమ్మ‌కాలు విప‌రీతంగా పెరిగాయి. తెలుగులో పుట్టి, అంచెలంచెలుగా పెరిగిన `మా` టీవీని స్టార్ట్ సంస్థ వందల కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గ‌తంలో ఈటీవీ సారథ్యంలోని పలు ఛానెళ్లను కూడా గతంలో విక్రయించేశారు. ఇప్పుడు టీవీ9 వంతు వ‌చ్చింది. పదుల కోట్లలో పెట్టుబడి పెట్టి, వందల కోట్లకు ఎదిగిన రెండో మీడియా సంస్థగా ఎదిగిన టీవీ 9.. కూడా అదే బాట పడుతోంది. తెలుగు టీవీ న్యూస్ చానల్స్ లో అగ్రగామి టీవీ-9ను విక్రయానికి ఉంచినట్టు తెలుస్తోంది.

టీవీ-9 పేరిట తెలుగు, కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో వార్తా చానల్స్ నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్) నుంచి మెజారిటీ వాటాలను విక్రయించేందుకు చర్చలు జ‌రుగుతున్నాయి. ఇప్పుడు నాలుగు మీడియా సంస్థలు టీవీ-9 బ్రాండ్ కోసం ఆసక్తిని చూపుతున్నాయట‌, నెల రోజుల్లో చర్చలు పూర్తి కావొచ్చని సమాచారం. ప్రస్తుతం ఏబీసీఎల్ లోని 80 శాతం వాటాలు చింతలపాటి శ్రీనిరాజు ఆధ్వర్యంలో నడుస్తున్న పీపుల్ క్యాపిటల్ ఎల్ఎల్సీతో పాటు, యూఎస్ కు చెందిన పీఈ (ప్రైవేటు ఈక్విటీ) సంస్థ సైఫ్ పార్ట్ నర్స్ వద్ద ఉన్నాయి, మిగతా వాటా సంస్థ సీఈఓ రవిప్రకాష్ తదితరుల వద్ద ఉంది.

టీవీ 9, దాని అనుబంధ చానెళ్లు అన్నీ కలిపి, విలువ లెక్కించే పని ప్రారంభమైంది. ప్రస్తుతం ఆర్థిక సేవలందిస్తున్న డెల్లాయిట్, కేపీఎంజీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థలు ఏబీసీఎల్ విలువను లెక్కిస్తున్నాయి. జీటీవీ సహా మరో 3 మీడియా కంపెనీలు టీవీ-9 కోసం చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్థిక సంస్థల నివేదిక ప్రకారం, ఇక టీవీ-9 బ్రాండ్ విలువ రూ. 850 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల మధ్య ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకసారి విలువ కట్టడం పూర్తయితే అమ్మకానికి బిడ్లు స్వీకరిస్తారట. ఏబీసీఎల్ కోసం దాఖలయ్యే బిడ్ లో అత్యధిక ధరను కోట్ చేసిన కంపెనీకి అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ లో 80 శాతం వాటా దక్కనుంది. మొత్తానికి బిజినెస్ రంగంలోనూ ఇదో సంచ‌ల‌న‌మే!