తెలంగాణ భూ కుంభ‌కోణంలో కేసీఆర్ మంత్రి

తెలంగాణ‌లో భూ అక్ర‌మార్కులు చెల‌రేగార‌ని, సబ్ రిజిస్ట్రార్‌లు అవినీతిలో ఆరితేరిపోయి.. అడ్డ‌గోలుగా స‌హాయం చేశార‌ని వార్త‌లు అందాయి. ఈ వ్య‌వ‌హారంలో టీ మంత్రుల హ‌స్తం కూడా ఉంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. దీంతో తీవ్రంగా ఫైరైన సీఎం కేసీఆర్‌.. వెంట‌నే ఏసీబీని రంగంలోకి దింపారు. అస‌లు విష‌యం ఏంటో అంతు తేల్చాల‌ని ఆదేశించారు. దీంతో ఇప్ప‌టికే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌పై దాడులు చేశారు. అధికారులు భారీ ఎత్తున ఆస్తులు కూడ‌బెట్టార‌ని, అవినీతిలో పేట్రేగిపోయార‌ని గుర్తించారు.

ఇదిలావుంటే, తెలంగాణ వ్య‌వ‌హార‌పై ఇటీవ‌ల కాలంలో ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేస్తున్న కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జ్ దిగ్విజ‌య్ సింగ్‌.. మియాపూర్‌ భూముల కుంభకోణంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు ప్రమేయం ఉందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ఆరోపించారు. బహుశా కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి డబ్బుల వసూలు కోసమే శ్రీనివాసయాదవ్‌లాంటి వ్యక్తులు అవసరమేమోనని వ్యాఖ్యానించారు. ఈ భూ కుంభకోణంలో కేసీఆర్‌ సర్కారు సరైన విచారణ జరుపుతుందన్న నమ్మకం లేదని.. అందువల్ల సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

అవసరమైతే భూములపై కాంగ్రెస్‌ హయాం నుంచీ విచారణ జరిపించినా తమకు అభ్యంతరం లేదన్నారు. ఇక‌, ఈ ప‌రిణామాలు .. మూడో వార్షికోత్స‌వానికి సిద్ధ‌మ‌వుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వానికి ప్రాణ సంక‌టంగా ప‌రిణ‌మించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏదో చిన్న‌పాటి వివాదాలు త‌ప్ప ఇలాంటి భారీ కుంభ‌కోణాలు వెలుగు రాలేదు. దీంతో ఇప్పుడు కేసీఆర్‌.. కు పెద్ద గండ‌మే అనే టాక్ వినిపిస్తోంది. మ‌రి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!