నంద్యాల సీటుపై చంద్ర‌బాబుకు అంత టెన్ష‌న్ ఎందుకో?

క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక‌పైటీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు భారీ ఎత్తున టెన్ష‌న్ ప‌డుతున్నారు. దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్న బాబు.. అక్క‌డ గెలుపుకోసం అన్ని విధాలా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. వాస్త‌వానికి నంద్యాల ఉప ఎన్నిక‌పై ఇంకా ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ నోటిఫికేష‌న్ జారీ చేయ‌లేదు. అయినా కూడా అటు అధికార‌, ఇటు విప‌క్ష పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం, ప్ర‌చారం త‌ప్ప పంపాకాలు ప్రారంభించేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

ఈవిష‌యంలో విప‌క్ష పార్టీని ప‌క్కన పెడితే.. బాబు మాత్రం అన్నీ పంచేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. నోటిఫికేష‌న్ వ‌చ్చే లోగానే పంచేస్తే.. ఎలాంటి గోలా ఉండ‌ద‌ని భావిస్తున్న బాబుకు అక‌స్మాత్తుగా నంద్యాల‌పై ఎక్క‌డాలేని ప్రేమ పుట్టుకొచ్చేసింది. ఒకవైపు రేషన్‌ కార్డులు, పింఛన్లు, పక్కాగృహాలు వంటి తాయిలాలను ఎర వేస్తూనే.. మరోవైపు అభివృద్ధి పేరుతో హడావుడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నంద్యాలలో పర్యటించారు. మంత్రులు కూడా క్యూ కడుతున్నారు. మునిసిప‌ల్ మంత్రి నారాయ‌ణ నంద్యాల‌లోనే ఉండి రోడ్లు, కాలువ‌లు శుభ్రం చేయించిన సంగ‌తి తెలిసిందే.

ఇక్క‌డే ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. గురువారం ఉద‌యం ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచి క‌ర్నూలు క‌లెక్ట‌ర్‌కి ఫోన్ వెళ్లింది. నంద్యాల అభివృద్ధికి ప్లాన్ సిద్ధం చేయాల‌ని ఆదేశించారు. అంతే కేవ‌లం గంట వ్య‌వ‌ధిలోనే రూ.298.21 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధ‌మైపోయాయి. ఈ విష‌యం తెలిసిన కొంద‌రు జిల్లా నేత‌లే ఆశ్చ‌ర్య పోయారు. ఒక్క‌సారిగా బాబుకి నంద్యాల‌పై ఇంత ప్రేమ పెరిగిపోయింది? ఏంటా అని చ‌ర్చించుకున్నారు.

ఇక‌, అదేస‌మ‌యంలో చామ కాలువలో పూడికతీత పనులకు రాత్రికి రాత్రే అంచనాలు వేయించారు. వాస్తవానికి ఆ కాలువ వరద నీటి నుంచి నంద్యాల పట్టణవాసులను కాపాడేందుకు రూ.20 కోట్లతో చేపట్టిన పనులకు సంబంధించిన కాంట్రాక్ట్‌ రద్దు కాలేదు. అయినప్పటికీ అధికార పార్టీ నేతలు నీరు–చెట్టు పథకం కింద నిబంధనలకు విరుద్ధంగా పూడికతీత పనులకు రూ.3 కోట్లతో అంచనాలు వేయించారు. ఇదంతా చూస్తుంటే.. నంద్యాల‌లో సీఎం చంద్ర‌బాబు మార్కు మ్యాజిక్ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు విప‌క్ష నేత‌లు.