వాకాటి గురించి వైసీపీ ముందే చెప్పిందా?!

అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో టీడీపీ నుంచి స‌స్పెండ్ అయిన ఆ పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయ‌ణ‌రెడ్డిపై జ‌గ‌న్ పార్టీ తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోయింది. వాకాటిని టీడీపీలోకి చే్ర్చుకునే ముందే తాము హెచ్చ‌రించామ‌ని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. వాకాటిపై ముందు నుంచే కేసులు ఉన్నా టికెట్‌ ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ప్రజల దృష్టిని మార్చేందుకే వాకాటిని టీడీపీ సస్పెండ్‌ చేసిందని ఆరోపించారు.

గంటా శ్రీనివాసరావు, సీఎం రమేశ్‌, రాయపాటి సాంబశిరావులపై కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సుజనా చౌదరి వేల కోట్ల రూపాయలు ఎగ్గొడితే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అక్రమ కేసులతో ప్రజాప్రతినిధులను భయపెట్టిన ఘనత చంద్రబాబుదని విమ‌ర్శించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు చేయించుకుని క్లీన్‌చిట్‌ తెచ్చుకునే ధైర్యం ఉందా అని నిలదీశారు.

చంద్రబాబు చుట్టూ వందల మంది విజయ్‌ మాల్యాలు ఉన్నారని విమర్శించారు. టీడీపీలో ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని సస్పెండ్‌ చేయాలని కాకాని డిమాండ్‌ చేశారు. మొత్తానికి వాకాటిపై సీబీఐ దాడులు, టీడీపీ చ‌ర్య‌లు వైసీపీకి కొత్త ఛాన్స్ ఇచ్చిన‌ట్ట‌యింది. నిజానికి చంద్ర‌బాబు తాను తన పార్టీ ఎంతో నిజాయితీగా ఉన్నామ‌ని చెబుతున్నా ప‌రిస్థితి అందుకు వ్య‌తిరేకంగా ఉంద‌నేందుకు వాకాటి ఉదాహ‌ర‌ణ‌ని ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి.