చంద్ర‌బాబు త‌ల‌నొప్పులు వ‌ద్దంటోన్న కేసీఆర్‌..!

ఎప్ప‌టి నుంచో ఊరిస్తూ ఊరిస్తూ వ‌స్తోన్న ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న ఎట్ట‌కేల‌కు ఇటీవ‌లే పూర్త‌య్యింది. ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న చాలా సంచ‌ల‌నాల‌కు కేంద్ర‌బిందువైంది. సంచ‌ల‌నాలు అనేకంటే మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశించ‌ని వారికి అనూహ్యంగా కేబినెట్‌లో బెర్త్ ద‌క్కితే…మంత్రి ప‌ద‌వి ఆశ‌లు పెట్టుకున్న వారికి మొండిచేయి ఎదురైంది. దీంతో మంత్రి ప‌ద‌వి రాని సీనియ‌ర్లు రాజీనామాల అస్త్రాలు సంధించ‌డంతో ఏపీ రాజ‌కీయం ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారి ఒక్క‌సారిగా హీటెక్కింది.

ఇక మంత్రి వ‌ర్గం నుంచి ఊస్టింగ్‌కు గురైన సీనియ‌ర్ బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి అయితే త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి సైతం రాజీనామా చేసి ప‌ట్టువీడ‌డం లేదు. ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న దెబ్బ‌కు అస‌మ్మ‌తి జ్వాల‌లు ఇంకా చ‌ల్లార‌లేదు. ఇదిలా ఉంటే త్వ‌ర‌లోనే తెలంగాణ కేబినెట్ సైతం ప్రక్షాళ‌న ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ కేబినెట్ లో మార్పులు చేర్పులు ఉంటాయని అప్పట్లో చెప్పిన సీఎం కేసీఆర్ ఆ ప్ర‌క్షాళ‌న ఎప్పుడు చేప‌డ‌తారో మాత్రం క్లారిటీ లేదు.

ఏపీలో కేబినెట్ ప్ర‌క్షాళ‌న చేసి చంద్రబాబు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చుకోవ‌డంతో ఇప్పుడు కేసీఆర్ ఈ రిస్క్ చేసేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది. కేసీఆర్ ఇన్న‌ర్‌గానే త‌న స‌న్నిహితుల‌తో కేబినెట్ ప్ర‌క్షాళ‌న లేద‌ని చెప్ప‌డంతో ఆయ‌న కేబినెట్‌లో మంత్రివ‌ర్గంలో ఆశ‌లు పెట్టుకున్న వారికి ఇది పెద్ద షాక్‌గానే ఉంది. అయితే మంత్రివ‌ర్గం ఆశ‌ల‌తో ఉన్న సీనియ‌ర్ల‌ను కేసీఆర్ ఎలా సంతృప్తి ప‌రుస్తార‌నేది మాత్రం చూడాలి.

కేసీఆర్ వ్యాఖ్య‌లు చాలా మందికి బాధ క‌లిగించినా మ‌రికొంద‌రిలో ఎక్క‌డ లేని ఆనందం నింపాయి. మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న జ‌రిగితే త‌మ మంత్రి ప‌ద‌వి పోతుంద‌ని భావిస్తోన్న వారు మాత్రం కేసీఆర్ డెసిష‌న్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నార‌ట‌. అయితే కేసీఆర్ ఒక‌రిద్ద‌రికి మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోను మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని డిసైడ్ అయిన‌ట్టు మ‌రో టాక్ వ‌స్తోంది. ఆయ‌న ఆలోచ‌న‌లు కూడా ఎప్పుడు ఎలా మ‌ర‌తాయో ఊహించ‌డం క‌ష్టం. మ‌రి ఈ లెక్క‌న చూస్తే తెలంగాణ కేబినెట్ ప్ర‌క్షాళ‌న ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చూడాలి.