టీడీపీ నుంచి ఆ ఎంపీ స‌స్పెన్ష‌న్‌..!

పార్టీ, సీఎం చంద్ర‌బాబుపై త‌న అసంతృప్తిని బ‌హిరంగంగా వ్య‌క్తం చేసిన చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్ త‌న పోరు కొన‌సాగిస్తున్నారు. ఈవిష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్‌గా తీసుకున్నారు. బుజ్జ‌గింపుల‌కు లొంగక‌పోవ‌డంతో.. ఆయ‌న‌పై వేటు త‌ప్ప‌ద‌ని అంతా స్ప‌ష్టంచేస్తున్నారు. వేటువేస్తే ఆయ‌న త‌దుప‌రి అడుగు ఏంటి? అనేది ఇప్పుడు అంద‌రిలోనూ మెదులుతోంది. `బ‌తికి ఉన్నంత‌కాలం చిత్తూరు ఎంపీని నేనే` అని ఆయ‌న ధీమాగా చెబుతున్నారు. సస్పెండ్ అయితే.. ఇక వైసీపీలో ఆయ‌న‌ చేరే అవ‌కాశాలున్నాయ‌నే చ‌ర్చ ఇప్పుడు పార్టీ వ‌ర్గాల్లో జోరుగా జ‌రుగుతోంది.

దళితులను పట్టించుకోవట్లేదని అధినేత‌పైనే శివ తాండ‌వం చేస్తున్నారు చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్‌! అంబేడ్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు టీడీపీలోనే కాక రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశ మ‌య్యాయి. పార్టీ క్ర‌మ‌శిక్షణ‌ విష‌యంలో తీవ్రంగా స్పందించే చంద్ర‌బాబు.. దీనిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధ‌మవుతున్నారు. మంత్రులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈ వ్యవహారంపై చర్చించి న సీఎం.. ఆ తర్వాత శివప్రసాద్ మళ్లీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతో ముఖ్యనేతలతో మరోసారి చర్చించారు.

అనంత‌రం సీఎం మాట్లాడుతూ.. హథిరాంజీ మఠం భూములు దళితులకివ్వాలని అడిగాడని, ఆ పని చేస్తే పార్టీకి చెడ్డపేరు వస్తుందని చెప్పి చేయనన్నానని, దాన్ని మనసులో పెట్టుకుని తనపై విమర్శలు చేశార‌ని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఈ మేర‌కు శివప్రసాద్‌పై చర్యలు తీసుకుంటానని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇటీవల శివప్రసాద్ కుమార్తెపై సొంత పార్టీ నేత – నాడు మంత్రిగా ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరులు దాడికి దిగితే… చంద్రబాబు పల్లెత్తు మాట అనకపోవడాన్ని కూడా శివప్రసాద్ జీర్ణించుకోలేకపోయార‌ట‌.

ఈ క్రమంలోనే పార్టీ మారడం మినహా ప్రత్యామ్నాయం లేదన్న భావనకు వచ్చిన శివప్రసాద్… వైసీపీలోకి చేరేందుకు సిద్ధపడ్డార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. శివప్రసాద్ మనసులోని మాట తెలిసినా కూడా చంద్రబాబు అండ్ కో ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించారని తెలుస్తోంది. పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరతానంటూ ప్రకటించక ముందే ఆయనపై టీడీపీ అధిష్ఠానం చర్యలకు సిద్ధ‌మ‌వుతోంద‌ట‌. దీంతో ఆయ‌న తీరు కూడా శివప్రసాద్ పార్టీ మార్పు ఖాయమన్న సంకేతాలను ఇస్తోందన్న వాదన వినిపిస్తోంది.