ఆ జిల్లాపై జ‌గ‌న్ ఆశ‌లు వ‌దులుకున్నాడా..!

వెనుక‌బ‌డిన జిల్లాగా పేరొందిన సిక్కోలులో వైఎస్సార్ సీపీలో వింత ప‌రిస్థితి క‌నిపిస్తోంది. నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త రాజ‌కీయాలు, విభేదాలు, స‌మ‌న్వ‌య లోపం ఇవ‌న్నీ పార్టీని మ‌రింత దిగ‌జారుస్తున్నాయి. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష నేత‌ల ప‌ట్టు ఈ జిల్లాపై త‌గ్గుతూ ఉంటే.. అధికార పార్టీ నాయ‌కుల హ‌వా నానాటికీ పెరుగుతోంది. ఇంత జ‌రుగుతున్నా.. వైసీపీ అధినేత జ‌గ‌న్ జిల్లా రాజ‌కీయాల‌పై దృష్టిపెట్ట‌క‌పోవ‌డం ఇప్పుడు అంద‌రిలోనూ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. జిల్లాలో కీల‌క‌మైన నాయ‌కులు పొంత‌న లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నా.. వాటన్నింటినీ స‌రిజేసి ఏక‌తాటిపైకి తీసుకురావాల్సిన నేత‌.. స్త‌బ్దుగా ఉండ‌టం చూస్తే.. ఆయ‌న ఈ జిల్లాపై ఆశ‌లు వ‌దిలేసుకున్నార‌నే అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంది.

నిరంతర పోరాటాలు.. ప్రజా ఉద్యమాలకు పెట్టింది పేరైన శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు స్తబ్దుగా ఉంటోంది. ఉద్యమాల పురిటిగడ్డలో విపక్షాలకు పనిలేకుండా పోయిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో నాయకులు అంతర్గత కలహాల మధ్య తీరిక లేకుండా ఉంటున్నారు. జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు కేవ‌లం ప్రెస్‌మీట్లకే పరిమితమవుతున్నారు. తమ్మినేని సీతారాం పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. ఆముదాలవలస నియోజకవర్గంపై పట్టు కోల్పోయిన సీతారాం మళ్లీ మెయిన్‌లైన్‌లోకి  రావడానికి అష్టకష్టాలు పడుతున్నారు.

ఎన్నికల ముందే పార్టీ పగ్గాలు చేపట్టిన జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి సీనియర్లను కాదనలేక … సొంత నిర్ణయాలు తీసుకోలేక నలిగిపోతున్నారట! అన్నీ తానై నడిపిస్తున్న ధర్మాన నిర్ణయమే జిల్లా పార్టీలో ఫైనల్‌.. ఇలాంటి సమయంలో తన నిర్ణయాలకు విలువ లేకుండా పోతుందన్న ఆవేదన చెందుతున్నార‌ట‌. శ్రీకాకుళం పార్టీ వ్యవహారాలు చూస్తున్న విజయసాయిరెడ్డి  చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారు! ఇక‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు ఏ నిమిషంలోనైనా ముహూర్తం ఖరారు కావొచ్చ‌నే వార్త ఇప్పుడు ధ‌ర్మాన‌ను కంగారుపెడుతోంద‌ట‌. ప్రస్తుతం జిల్లాలో టీడీపీ గాలి బలంగా వీస్తున్న త‌రుణంలో ఎన్నిక‌ల్లో ఓడిపోతే ప‌రువు పోతుంద‌ని భ‌యంపట్టుకుంద‌ట‌.

2014 సాధారణ ఎన్నికల్లో జిల్లాలో మూడు స్థానాలు వైసీపీకి దక్కాయి. ఇందులో పాలకొండ.. రాజాం ఎమ్మెల్యేలు మాత్రం పార్టీలో కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గాలపై పట్టున్న కళా వెంకట్రావుకు మంత్రి పదవి లభించడంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సైకిలెక్కేయడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా పార్టీ అధినేత జగన్‌ శ్రీకాకుళం జిల్లావైపు ఎందుకు చూడటం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇక జిల్లాపై జ‌గ‌న్ ఆశ‌లు వ‌దిలేసుకున్న‌ట్టేనా అని అంతా భావిస్తున్నారు.