ఏపీ క్యాబినెట్ చ‌రిత్ర‌లో లోకేష్ – అఖిలప్రియ

యువ‌రక్తాన్ని పార్టీలో ఎక్కించేందుకు టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు అహ‌ర్నిశ‌లు కృషిచేస్తున్నారు. యువ మంత్రం జ‌పిస్తున్న ఆయ‌న‌.. ఇప్పుడు త‌న మంత్రి వ‌ర్గంలోనూ యువ‌రక్తాన్ని ఉర‌క‌లెత్తించ‌బోతున్నారు. త‌న త‌న‌యుడు లోకేష్‌తో పాటు ఇటీవ‌ల మృతిచెందిన నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కూతురు, ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ‌ను త‌న మంత్రివ‌ర్గంలోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే లోకేష్‌, అఖిల ప్రియ స‌రికొత్త రికార్డును నెల‌కొల్పిన‌ట్టే అవుతుంది. అదేంటంటే.. అతి పిన్న వ‌య‌స్సులోనే మంత్రి అయిన వారిగా ఏపీ క్యాబినెట్ చ‌రిత్ర‌లో వీరు నిలిచిపోతున్నారు.

సీఎం చంద్రబాబు మంత్రివర్గంలోకి త్వరలో యువరక్తం చేరనుంది. ఏప్రిల్‌లో మంత్రివర్గ పునర్‌వ్యవస్ధీకరణ జరుగుతుందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. యువతరం ప్రతినిధులుగా నారా లోకేశ్, భూమా అఖిలప్రియకు మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ కేబినెట్‌లో ఇంత తక్కువ వయసు ఉన్న వారు మంత్రులుగా చేరడం ఇదే ప్రథమం కానుంది. వీరిద్దరిలో లోకేశ కన్నా అఖిల ఇంకా చిన్న వయస్కురాలు. అయితే చట్టసభలో సభ్యురాలిగా ఆమె లోకేశ్ కన్నా సీనియర్‌ కావడం విశేషం. ఆమె 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఆళ్ళగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. లోకేశ్ ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

తండ్రి భూమా నాగిరెడ్డి బతికి ఉన్నంతకాలం అఖిలప్రియ రాజకీయ వ్యవహారాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న నాగిరెడ్డి ఆళ్ళగడ్డ వ్యవహారాలను కూడా ఎక్కువ భాగం తానే చూసుకొనేవారు. దీనితో ఆమెకు పూర్తి స్ధాయిలో పనిచేయాల్సినంత అవసరం రాలేదు. కానీ ఇటీవల తండ్రి ఆకస్మిక మరణంతో అఖిలప్రియపై ఒకేసారి మోయలేనంత బరువు పడింది. తన నియోజకవర్గమైన ఆళ్ళగడ్డతోపాటు తండ్రి నియోజకవర్గం నంద్యాలలో కూడా ప్రజల సమస్యలు, పార్టీ వ్యవహారాలు, తమ వర్గీయుల మంచిచెడూ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అఖిలప్రియ కూడా ఈ పరిస్థితికి మానసికంగా సన్నద్ధమై పనిచేస్తున్నారు.

తండ్రి చనిపోయిన రెండు రోజుల్లోనే అసెంబ్లీలో పాల్గొని మాట్లాడిన తీరు అఖిల గుండె నిబ్బరాన్ని, పరిణ‌తిని చాటింది. అఖిలప్రియ మానసికస్థైర్యం సీఎం చంద్రబాబును ఆకట్టుకుంది. భూమా కుటుంబానికి ఇప్పుడు నాయకత్వ సమస్య లేదని, నాగిరెడ్డి లేని లోటును అఖిల పూడుస్తున్నారని ఆయన పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించారు. నేరుగా ఎక్కడా చెప్పకపోయినా ఈసారి మంత్రివర్గ విస్తరణలో అఖిలప్రియకు స్థానం ఉంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. భూమా నాగిరెడ్డిని తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు గతంలో అనుకొన్నారు. ఆయన లేకపోవడంతో ఆ స్థానంలో అఖిలను తీసుకోవడం ఖాయమని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.