ప‌న్నీర్‌పై అత్త‌రు జ‌ల్లుతున్న అన్నాడీఎంకే

మొన్న‌టి వ‌ర‌కూ గ్రూపులుగా విడిపోయిన అన్నాడీఎంకే నేత‌లు.. ఇప్పుడు ఐక్య‌తారాగం మొద‌లుపెట్టారు. అంద‌రం క‌లిసికట్టుగా డీఎంకే పోరాడ‌దామ‌ని పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా తిరుగుబాటు నేత పన్నీర్ సెల్వాన్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. శత్రువుల‌తో మితృత్వం వ‌ద్ద‌ని.. అంతా క‌లిసి ఐక్యంగా డీఎంకేపై పోరాడదామ‌ని స్నేహ హ‌స్తం అందిస్తున్నారు. ఎమ్మెల్యేల మెజారిటీ ద‌క్క‌క‌పోయినా.. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు మాత్రం ప‌న్నీర్ సెల్వానికే ఉంద‌ని గ్ర‌హించిన నేత‌లు.. ఇప్పుడు ఆక‌ర్షించే ప‌నిలో ప‌డ్డారు. ఆయ‌న పార్టీ పెడ‌తార‌ని ఊహాగానాలు వ‌స్తున్న నేప‌థ్యంలో స‌రికొత్త వ్యూహానికి తెర‌తీశారు. ప‌న్నీర్ సెల్వం అండ్ కో తిరిగి పార్టీలోకి రావాల‌ని కోరుతున్నారు.

ఇటీవల కొన్ని అనివార్య సంఘటనలతో పార్టీకి దూర‌మైన‌ పన్నీర్‌తో సహ దూరమైన నేతలంతా మళ్లీ స్వంతగూటికి రావాలని అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పిలుపునిచ్చారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆశీస్సులతో చిన్నమ్మ శశికళ.. సలహాలను పాటిస్తూ అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తోందన్నారు. అయితే రాజకీయ దురుద్దేశంతో డీఎంకే పార్టీ ప్రభుత్వం గురించి అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు.

అసెంబ్లీలో ఉద్దేశపూర్వకంగానే డీఎంకే నేత స్టాలిన తమ సభ్యులతో కలిసి గలాభా సృష్టించార‌ని, ప్రభు త్వాన్ని కూల్చాలన్న ఉద్దేశంతోనే వారు అలా వ్యవహరించారన్నారు. ఎంజీఆర్‌, జయలలిత హయాంలో కూడా పార్టీలో కొంతమంది ద్రోహులు న్నారని, అయినా కొన్ని రోజుల తరువాత వారు మనసు మార్చుకుని పార్టీ అభివృద్ధికి సహకరించారన్నారు. ఇటీవల పార్టీ నుంచి విడిపోయిన ఓపీఎస్‌ సహా మిగిలిన నేతలంతా మళ్లీ మాతృసంస్థకు తిరిగి వస్తారన్న నమ్మకం ఉందన్నారు. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్నారు. ఆర్‌కే నగర్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎవ్వరం పోటీ చేయా లన్నదానిపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

శశికళ కుటుంబీకుల చేతిలో అన్నాడీఎంకే చిక్కుకుందని విమర్శలపై మాట్లాడుతూ.. ఇదంతా డీఎంకే నేత స్టాలిన చేస్తున్న అసత్య ప్రచారమేనని కొట్టిపారేశారు. అన్నాడీఎంకేలో పదవుల కోసం పోరాడిన వారు ఇప్పటి వరకూ లేరని, కొంతమంది అప్పుడప్పుడూ అలిగినా మళ్లీ వాస్తవాన్ని గ్రహించేవారని, ఇప్పుడు కూడా అలానే జరిగిందని వివరించారు. మ‌రి మొత్తానికి ప‌న్నీర్ కు గేలం వేసేందుకు అన్నాడీఎంకే నేత‌లు సిద్ధ‌మైపోయారు.