సూప‌ర్ థ్రిల్ల‌ర్ సినిమాలా డీఎంకే పాలిటిక్స్‌

త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు.. థియేట‌ర్ల‌కు వెళ్ల‌కుండానే రోజుకో కొత్త సినిమా చూసేస్తున్నారు! నిజ‌మా?! అని బుగ్గ‌లు నొక్కుకోవాల్సిన ప‌నిలేదు. త‌మిళ‌నాడులో గ‌త నెల రోజులుగా జ‌రుగుతున్న పొలిటిక‌ల్ పరిణామాలు నిజంగానే జ‌నాల‌కి సినిమా మీద సినిమా చూపించేస్తున్నాయి. పురుట్చిత‌లైవి.. అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణం, ఆ త‌ర్వాత నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ప‌న్నీర్ సీఎం కావ‌డం తెలిసిందే. అయితే, ఆ సీఎం సీటు కోసం అమ్మ నెచ్చెలి త‌న స్టైల్లో పావులు క‌ద‌ప‌డం నిన్న‌టి వ‌ర‌కు హాట్ టాపిక్‌. ఇక‌, ఇప్పుడు ఇదే సీన్ త‌మిళ‌నాడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష డీఎంకేలో క‌నిపించ‌నుంది.

డీఎంకే పార్టీ వ్య‌వ‌స్థాప‌క కురువృద్ధుడు క‌రుణానిధి.. ఆ పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ను ఎన్నుకునే త‌రుణం ఆస‌న్న‌మైంది. ఇన్నాళ్లూ ఒంటి చేత్తో నెట్టుకొచ్చిన క‌రుణ‌.. ఇక‌, పార్టీ భారం త‌గ్గించుకునే ప‌నిలో ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 4న పార్టీ స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నిక అనివార్యంగా జ‌ర‌గ‌నుంది. అయితే, ఇక్క‌డే అస‌లు కీల‌క ప‌రిణామం చోటు చేసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. పార్టీలో వ‌చ్చిన విభేధాల కార‌ణంగా గ‌త ఏడాది రాష్ట్రంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు అలిగి పార్టీని వీడిన క‌రుణ పెద్ద కుమారుడు అళ‌గిరి పార్టీలోకి తిరిగి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు.

అదేస‌మ‌యంలో తండ్రి అడుగుజాడ‌ల్లో న‌డిచి.. ఆయ‌న‌నే వెంట‌పెట్టుకుని ఉన్న చిన్న కుమారుడు స్టాలిన్‌.. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి పోటీలో ఉన్నాడు. నిజానికి క‌రుణ కూడా స్టాలిన్‌నే ఎన్నుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే జ‌రిగితే.. భ‌విష్య‌త్తులో క‌రుణ త‌ర్వాత స్టాలినే డీఎంకే సార‌ధి కావ‌డం త‌థ్యం. ఈ క్ర‌మంలో అటు అళ‌గిరి పార్టీపై ప‌ట్టు సాధించేందుకు గ‌తాన్ని మ‌రిచిపోయి.. పార్టీలోకి వ‌చ్చేందుకు రెడీ అయ్యాడు.

గ‌తంలోనూ పార్టీలో అధికారం కార‌ణంగానే దూర‌మైన అళ‌గిరి.. ఇప్పుడు మ‌రోసారి తిరిగి పార్టీలోకి వ‌స్తుండ‌డంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది. ద‌క్షిణ త‌మిళ‌నాడులో అళ‌గిరికి మంచి ప‌ట్టు ఉండ‌డం, మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో తృటిలో అధికారం కోల్పోవ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో రేపు జ‌ర‌గ‌నున్న స‌మావేశానికి ప్రాధాన్య సంత‌రించుకుంది. ఈ ప‌రిణామ‌మే ఇప్ప‌డు రాష్ట్రంలో ఆస‌క్తిగా మారింది.