చంద్ర‌బాబుకు యాంటీగా ఏపీలో బ‌స్సు యాత్ర‌

పాలిటిక్స్‌లో ఒకరి ఐడియాను ఇంకొక‌రు కాపీ కొట్టినా త‌ప్పుకాదు! ఇప్పుడు సీపీఐ నేత‌లు ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తంలో చేప‌ట్టిన ఓ యాత్ర‌నే మ‌క్కీకి మ‌క్కీ కాపీ కొడుతున్నారు. చంద్ర‌బాబు పాల‌న‌పై దండెత్తుతున్న సీపీఐ.. ప్ర‌జ‌ల్లోకి మ‌రింత వేగంగా త మ ప్ర‌ణాళిక‌ల‌ను తీసుకువెళ్లేందుకు, బాబును ఏకేసేందుకు బ‌స్సు యాత్ర‌ను మించింది మ‌రోటి లేద‌ని డిసైడ్ అయింది. మ‌రో రెండేళ్ల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం చేప‌ట్ట‌బోయే బ‌స్సు యాత్ర అన్ని విధాలా బాగుంటుంద‌ని సీపీఐ నేత‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ నెల నుంచి బ‌స్సు యాత్ర‌కు శ్రీకారం చుట్టారు.

ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ యాత్ర‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు. అదే స‌మ‌యంలో అధికార బాబుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు తీవ్ర అణిచివేతకు గురవుతున్నయ‌ని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి- సామాజిక న్యాయం’ ఎజెండాగా ఈ నెల 26 నుంచి 40 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రజా చైతన్య బస్సుయాత్ర’ నిర్వహిస్తున్న‌ట్టు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమ‌య్యే ఈ యాత్ర 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల గుండా ఈ సాగుతుంద‌ని, హిందూపురంలో ముగుస్తుందని వివరించారు.

ఈ యాత్రలో అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ – సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి – సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు – జనతాదళ్ నేత శరద్ యాదవ్ వంటి ప్రముఖులు పాల్గొంటారని రామకృష్ణ తెలిపారు. అమరావతిని ఫ్రీజోన్ గా ఉంచాలని ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లను అమలు చేయాలని చేతివృత్తులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. రెండున్నరేళ్లలో 430 సంక్షేమ హాస్టళ్లను మూసివేశారని తెలిపారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఒక్కొక్కరికి ప్రతీ నెల రూ 2 వేల నుంచి రూ 4 వేల వరకూ కేటాయించాలని కోరారు. మొత్తానికి ఈ ఎర్ర‌బ‌స్సు యాత్ర ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.