మోత్కుప‌ల్లి గ‌వ‌ర్న‌ర్ పోస్టుపై కొత్త ట్విస్ట్‌

వ‌ర్ష‌పు చినుకు కోసం చ‌కోర ప‌క్షి ఎన్నో రోజుల పాటు వేచిచూస్తుంది. ఇప్పుడు ఈ చందంగానే గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి కోసం టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. అన్నీ అయిపోయాయి.. ఇక అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి అన్న స‌మ‌యంలో ఏదో ఒకటి అడ్డు త‌గ‌లి ఆయ‌న ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్ల‌డం జ‌రిగిపోతోంది. అయితే ఇప్పుడు మోత్కుపల్లి గ‌వ‌ర్న‌ర్ పోస్టుపై కొత్త ట్విస్ ఒక‌టి తెర‌పైకి వ‌చ్చింది.

ఇక తాను ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పాల్గొన‌లేన‌ని, త‌న‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇప్పించాల‌ని మోత్కుప‌ల్లి.. చంద్ర‌బాబును అభ్య‌ర్థించారు. టీడీపీ-బీజేపీ మిత్ర బంధంలో భాగంగా.. మోత్కుప‌ల్లికి గ‌వ‌ర్న‌ర్ పోస్టు ఇవ్వాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. బీజేపీ అధిష్ఠానాన్ని కోరారు. అయితే దీనిపై తొలుత సానుకూలంగా స్పందించిన బీజేపీ.. త‌ర్వాత మీన‌మేషాలు లెక్కిస్తోంది. ఇప్పుడూ అప్పుడూ అంటూ.. వాయిదా వేస్తూ వ‌స్తోంది.

త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా రోశ‌య్య ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తారన్నవార్త‌లు వెలువ‌డిన స‌మ‌యంలో ఆ ప‌ద‌విని మోత్కుప‌ల్లికి ఇచ్చే అంశాన్నిబీజేపీ ప‌రిశీలించింది. అయితే చివ‌ర‌కు ఈ నిర్ణ‌యం వాయిదా ప‌డిపోయింది. తాజాగా త‌మిళ‌నాడు గ‌వ‌ర్నర్‌గా క‌ర్ణాట‌క‌కు చెందిన బీజేపీ సీనియ‌ర్ నేత శంక‌ర‌మూర్తి పేరు దాదాపు ఖ‌రారైంది. ఈ క్ర‌మంలో మ‌రోమారు మోత్కుప‌ల్లి అంశం తెర‌పైకి వ‌చ్చింది. ఆయ‌న‌కు గ‌వ‌ర్న‌ర్ గిరీ ఇచ్చేందుకు బీజేపీ కూడా సుముఖంగానే ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

శంక‌ర‌మూర్తి నియామ‌కంతో పాటు మోత్కుప‌ల్లిని కూడా గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మిస్తూ ఒకేసారి ఉత్త‌ర్వులు వెలువ‌డ‌నున్న‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే మోత్కుప‌ల్లిని ఏ రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్‌గా పంపుతార‌న్న విష‌యంలో మాత్రం స్ప‌ష్ట‌త రావడం లేదు. ప్ర‌స్తుతం శీతాకాల విడిది కోసం హైద‌రాబాదు వ‌చ్చిన రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ తిరిగి ఢిల్లీ వెళ్లేస‌రికి వీరి నియామ‌కాల‌కు సంబంధించి ప్ర‌తిపాద‌న‌లు సిద్ధంగా ఉంచే దిశ‌గా కేంద్రం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం.