చంద్ర‌బాబుకు మ‌రో ఇర‌కాటం

ఏపీ ఏకైక విప‌క్షం జ‌గ‌న్ నేతృత్వంలోని వైకాపా నుంచి చంద్ర‌బాబుకు మ‌రో ఇబ్బంది ఎదురుకానుందా?  తాను ఎంతో ఫ్యూచ‌ర్ ఆలోచించి వైకాపా ఎమ్మెల్యేల‌ను, ఎమ్మెల్సీల‌ను సైకిల్ ఎక్కించుకున్న పాపానికి ఇప్పుడు బ‌లి కావాల్సి వ‌స్తోందా?  త్వ‌ర‌లోనే దీనిపై రాజ్య‌స‌భ‌లో పెద్ద ఎత్తున గంద‌ర‌గోళం జ‌రిగే ఛాన్స్ క‌నిపిస్తోందా?  అంటే.. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాలు ఔన‌నే స‌మాధాన‌మే ఇస్తున్నాయి. జ‌గ‌న్ ఇమేజ్ కానివ్వండి, వాళ్ల సొంత ఇమేజ్ కానివ్వండి 2014 ఎన్నిక‌ల్లో గెలిచిన వైకాపా అసెంబ్లీ స‌భ్యులు మొత్తంగా 20 మంది వ‌రుస పెట్టి చంద్ర‌బాబు చెంతకు చేరిపోయిన విష‌యం తెలిసిందే.

అయితే, వారిపై క‌సి తీర్చుకోవాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు ఒంటికాలిపై లేస్తున్న జ‌గ‌న్‌.. ఇప్ప‌టికే స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావుకి ఫిర్యాదు కూడా చేశారు. ద‌మ్ముంటే వారితో రాజీనామాలు చేయించాల‌ని బాబుకు స‌వాళ్లు కూడా సంధించారు. అయినా ఎక్క‌డా జ‌గ‌న్‌కి ఆశించిన రిజ‌ల్ట్(జంపింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీపై చ‌ర్య‌లు) రాలేదు. దీంతో ఆయ‌న ఇప్పుడు రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి రూపంలో చంద్ర‌బాబుపై యుద్ధానికి దిగారు.  వైకాపా స‌భ్యుల‌ను అన్యాయ‌మైన ప‌ద్ధ‌తిలో టీడీపీ చేర్చుకుంద‌ని, ఇది పార్టీ ఫిరాయింపుల చ‌ట్టాన్ని అతిక్ర‌మించ‌డ‌మేన‌ని పేర్కొంటూ.. తాజాగా విజ‌యసాయి.. రాజ్య‌స‌భ‌లో ఓ ప్రైవేటు మెంబ‌రు బిల్లును స‌మ‌ర్పించారు.

ఈ ప‌రిణామం ఏపీలో పొలిటిక‌ల్‌గా పెను సంచ‌ల‌నం సృష్టించింది. చ‌ట్ట స‌భల స‌భ్యుల పార్టీ  ఫిరాయింపుల చట్టాన్ని 2016 బిల్లు పేరిట  సవరించాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కు విజ‌య‌సాయి నోటీసు(ప్రైవేటు బిల్లు) ఇచ్చారు.  ఆర్టికల్ 102 – ఆర్టికల్ 191ల కింద వ‌చ్చిన ఈ ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టం ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా అభాసు పాల‌వుతోంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌తంలో దేశ వ్యాప్తంగా జంపింగ్‌లు పెరిగిపోయిన నేప‌థ్యంలో వాటిని క‌ట్ట‌డి చేసేందుకు తెచ్చిన ఈ ప్ర‌తిష్టాత్మ‌క చ‌ట్టం.. ప్ర‌స్తుతం కొర‌గాకుండా పోతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఒక పార్టీలో గెలిచి, సొంత లాభాల కోసం మ‌రో పార్టీలోకి చేరుతున్న ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయ‌ని విజ‌య‌సాయి పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా దేశంలో ఏపీ స‌హా ఉత్త‌రాఖండ్ త‌దిత‌ర రాష్ట్రాల్లో జ‌ర‌గిన ఫిరాయింపు ఘ‌ట‌న‌ల‌ను ఆయ‌న ఏక‌రువు పెట్టారు. ఈ చ‌ట్టాన్ని మ‌రింత ప‌టిష్టంగా రూపొందించేందుకు దీనిని స‌వ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న విన్న‌వించారు. డిప్యూటీ స్పీక‌ర్ ఈ బిల్లును స్వీక‌రించారు. దీనిపై ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి. ఇక‌, గ‌తంలో ఏపీ ప్ర‌త్యేక హోదాపై కేవీపీ ప్ర‌వేశ పెట్టిన బిల్లు.. వీగిపోయింది. మ‌రి దీని ప‌రిస్థితి ఏమ‌వుతుందో చూడాలి.