ప‌వ‌న్ సేఫ్ గేమ్ వైపే మొగ్గు…!

ఆంధ్ర‌ప్రదేశ్ రాజ‌కీయాల్లో అంత‌కుముందు అడ‌పా ద‌డ‌పా కొంగ‌ర జ‌గ్గ‌య్య వంటి న‌టులు రాజ‌కీయాలవైపు ఒకో అడుగు వేసినా… 1980 వ‌ద‌శ‌కం మొద‌ట్లో విశ్వ‌విఖ్యాత న‌టుడు ఎన్టీఆర్ రాజ‌కీయ ఆరంగేట్రం త‌రువాత‌నే పూర్తి స్థాయిలో సినీ న‌టుల హ‌వా మొద‌లైంద‌ని చెప్పాలి. రాష్ట్ర రాజ‌కీయ చ‌రిత్ర‌నే స‌మూలంగా మార్చేసిన ప‌రిణామం… తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఇక ఆనాటినుంచి ఏపీ రాజ‌కీయాల్లో సినీ న‌టుల పాత్ర‌లేని పార్టీలే లేవంటే అతిశ‌యోక్తి లేదేమో.

ఎన్టీఆర్ యుగం అనంత‌రం… సినిమాల్లోంచి.. సొంత పార్టీ స్థాపించి…అట్ట‌హాసంగా రాజకీయాల్లోకి వ‌చ్చిన మ‌రో ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవి. అయితే చిరంజీవి చరిష్మా.. రాజ‌కీయంగా అనుకున్నంత ప్ర‌భావం చూప‌లేకపోవ‌డంతో.. ఆయ‌న‌ త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆ పార్టీ పంచ‌న చేరిపోయారు. ఇక ఇప్పుడు తాజాగా మ‌రో అగ్రన‌టుడు, చిరంజీవి సోద‌రుడు… ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ద‌మ‌య్యారు.

అయితే ఎన్టీఆర్   హ‌యాం నాటి రాజ‌కీయాల‌కు ప్ర‌స్తుతానికీ క‌నిపిస్తున్న స్ప‌ష్ట‌మైన తేడా ఒక‌టి అంద‌రూ త‌ప్ప‌క గుర్తుంచుకోవాలి.   ఎన్టీఆర్ కాలంలో ఆయ‌న‌ను అన్ని వ‌ర్గాలు, కులాల ప్ర‌జ‌లు అభిమానించేవారు. ఆరాధించేవారు. అందుకే ఆయ‌న సినిమాల్లోనే కాదు… రాజ‌కీయ రంగంలోనూ.. సంచ‌ల‌న విజ‌యాల‌కు కేంద్ర బిందువుగా ఉండేవారు. ఆయ‌న త‌రువాత ఆ స్థాయిలో అన్ని వ‌ర్గాల ఆద‌ర‌ణ‌ను పొంద‌గ‌లిగే నాయ‌కుడు మ‌రొక‌రు రాలేద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం జ‌నం.. కుల‌, మత‌, ప్రాంతాల ప్రాతిప‌దిక‌న చీలిపోయిన దుస్థితి నేడు క‌నిపిస్తోంది. ఈ స‌మ‌యంలో ఏ న‌టుడైనా రాజ‌కీయాల్లో నెగ్గుకురావ‌డం.. అంత ఆషామాషీ వ్య‌వ‌హార‌మేం కాదు.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేస్తూ రాజకీయంగా త‌న తొలి అడుగుల‌ను ఆచితూచి వేస్తున్న‌ట్టు ఆయ‌న ఆంత‌రంగికులు చెపుతున్నారు. నిజానికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు నిజాయితీప‌రుడిగా, క్లీన్ ఇమేజ్ ఉన్న వ్య‌క్తిగా, క‌ష్టాల్లో ఉన్న‌వారిని ఆదుకునే మ‌నిషిగా ప్ర‌జ‌ల్లో మంచి పేరే ఉంది. అయితే ఒక‌సారి  పూర్తి స్థాయిలో రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టాక‌… ప్ర‌త్య‌ర్థుల‌నుంచి  నిర్దాక్షిణ్యంగా ఎదుర‌య్యే ప‌లు ర‌కాల విమ‌ర్శ‌ల‌ దాడుల‌కు, దూష‌ణ‌ల‌కు, ప్ర‌శ్న‌ల‌కు ఆయన సిద్ధ‌ప‌డాల్సి ఉంటుంది.  అంతేకాదు… ఆయ‌న‌ను ఓ వ‌ర్గానికి నాయ‌కుడిగా ముద్ర‌వేసేందుకు ప్ర‌త్య‌ర్థి పార్టీలు త‌ప్ప‌క ప్ర‌య‌త్నిస్తాయి. ఎందుకంటే అంద‌రివాడుగా ఉంటూ.. చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు నిజాయితీని వ‌దిలిపెట్ట‌ని ఎన్టీఆర్ లాంటి వ్య‌క్తిపై కూడా ప్ర‌త్య‌ర్థినేత‌లు ఇలాంటి విమ‌ర్శ‌లు చేసేందుకు వెనుకాడ‌ని విష‌యం ఇక్క‌డ గుర్తుంచుకోవాలి.

ఇవ‌న్నీ ఆలోచించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న రాజ‌కీయ ఆరంగేట్రానికి వేదికగా త‌న సొంత జిల్లా అయిన‌ ప‌శ్చిమ‌గోదావ‌రిని ఎంచుకున్నారు. ఏలూరు.. రాజ‌ధాని అమ‌రావ‌తికి ద‌గ్గ‌ర‌గా ఉన్న ప్రాంతం. ఇక వ‌ర్గ‌ సమీక‌ర‌ణ‌ల ప్ర‌కారం చూసినా ఉభ‌య‌గోదావ‌రిజిల్లాల్లోను ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గం మెజారిటీగా ఉంది. ఏలూరులో కూడా ఆయ‌న సామాజిక‌వ‌ర్గం బ‌లంగానే ఉంది. అంత‌కుమించి… ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలను ఆయ‌న త‌న పార్టీకి బ‌ల‌మైన కోట‌లుగా మ‌ల‌చుకోగ‌లిగితే చాలు… ఆయన రాజ‌కీయంగా స‌గం విజ‌య‌వంతమైన‌ట్టే. ఎందుకంటే ఈ జిల్లాలు ఎటువైపు మొగ్గితే రాష్ట్రంలో అధికారం ఆ పార్టీని వ‌రించిన‌ట్టేన‌న్న నానుడి ఉండ‌నే ఉంది. అందుకే ప‌వ‌న్ సేఫ్ గేమ్ ఆడేందుకే సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.