చంద్ర‌బాబు అక్కౌంట్‌లో మ‌రో బురిడీ స్కెచ్‌..!

తెలుగువారు.. అందులోనూ ప్ర‌త్యేకించి సీమాంధ్రులు చేసుకున్న పాప‌మేమోకాని… ఇప్ప‌టిదాకా రాజ‌ధాని స్థాయి న‌గ‌రం ఒక‌దానిని కూడా అభివృద్ధి చేసుకోలేక‌పోయారు. రెండువంద‌లేళ్లు క‌ష్ట‌ప‌డి మ‌ద్రాసును అభివృద్ధి చేస్తే అది త‌మిళ‌తంబీలు త‌మ‌ద‌న్నారు. మ‌ళ్ళీ అర‌వై ఏళ్లు క‌ష్ట‌ప‌డి హైద‌రాబాద్‌ను సైబ‌రాబాద్‌గా మారిస్తే… దానిపై మీకు హ‌క్కులేదంటూ తెలంగాణ త‌మ్ముళ్లు త‌రిమేశారు. దీంతో సీమాంధ్ర‌లోనూ మ‌ద్రాసు, హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల‌ను త‌ల‌ద‌న్నే న‌గ‌రాన్ని అభివృద్ధి చేసుకోవాల‌న్న‌ది ప్ర‌స్తుతం సీమాంధ్రుల‌కు బ‌ల‌మైన సెంటిమెంట్‌గా మారిపోయింది.

వాస్త‌వానికి.. ప్ర‌జ‌ల్లో ఉన్న ఈ  సెంటిమెంటే..  ఏపీలోని రాజ‌కీయ‌నాయ‌కుల‌కు ఓర‌కంగా వ‌రంగా మారిపోయింది.  ఏపీ ముఖ్య‌మంత్రి ఇత‌ర విష‌యాల‌న్నీ ప‌క్క‌న‌బెట్టి మ‌రీ రాజ‌ధాని నిర్మాణంపై అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు విప‌క్షాల‌నుంచి విన‌వ‌స్తున్నా.. ప్ర‌జ‌ల భావోద్వేగాల‌తో ముడిప‌డిన అంశం కావడంతో ఈ విష‌యంలో చంద్ర‌బాబు చేస్తున్న‌దే క‌రెక్ట‌ని చాలామంది న‌మ్ముతున్నారు.

విష‌య‌మేమిటంటే…నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం 32,500 కోట్ల రూపాయల సేకరణకు తొమ్మిది మార్గాలను అన్వేషించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశంలో చెప్పారు. వచ్చే పదేళ్లలో ఈ బృహ‌త్త‌ర నిర్మాణాల‌కు మొత్తం 43 వేల కోట్లు ఖర్చు చేస్తామని, అందులోనూ  అధిక భాగం వచ్చే మూడేళ్లలోనే వ్యయం చేయ‌నున్నామ‌న్న‌ది ఆయ‌న వివ‌ర‌ణ‌.

ఇదంతా విన‌డానికి బాగానే వుంది గాని, రాజ‌ధాని కోసం ఇప్పటిదాకా  కేంద్రం నుంచి వచ్చిన నిధుల మాటేమిటి?  వాటిని ఎక్క‌డ వ్య‌యం చేశారు..? వాటితో ఏమాత్రం భ‌వ‌నాలు నిర్మించారు..? ఒక‌ప‌క్క వివాదాలు చెల‌రేగుతున్న‌ హైకోర్టు,  అసెంబ్లీ భవనం వంటి వాటికోసం కేంద్రం ఇచ్చిన 800 కోట్ల పైచిలుకు నిధులు ఏమ‌య్యాయ‌నే విష‌యాల‌పై మాత్రం ముఖ్య‌మంత్రి మాట్లాడ‌టం లేదు. నిజానికి ఈ నిధుల‌ను టీడీపీ ప్ర‌భుత్వం ఇతర పనులను మళ్లించింది. ప్ర‌భుత్వ అవ‌స‌రాలు, ప్రాధాన్యాలు ఎలాగైనా ఉండొచ్చుకాక‌..! రాజ‌ధాని కోసం వ‌చ్చిన నిధులను  వేరే ప‌నుల కోసం వెచ్చించ‌డం మాత్రం ఖ‌చ్చితంగా పొర‌పాటు. ఈ నేప‌థ్యంలో కొత్తగా సేకరించే నిధుల గురించి ప్ర‌భుత్వం చెప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనమో చంద్ర‌బాబే సెల‌వీయాలి.

ప్రపంచంలో అత్యుత్తమ విద్యా సంస్థలు, ఆస్పత్రులు వంటివి రప్పించాలని మంత్రుల‌కు, అధికారుల‌కు ఆదేశాలివ్వడం కూడా ఘనంగానే ఉంది కాని.. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న ఏమీ జ‌రుగ‌కుండానే ఇవ‌న్నీ రెడీమేడ్‌గా వ‌చ్చేయ‌డం సాధ్య‌మేనా… ఇదే ఇపుడు అంద‌రినీ తొలుస్తున్న ప్ర‌శ్న‌.  అస‌లు పరిశ్రమలు ఫైవ్‌స్టార్ హోటళ్లు వస్తేనే రాజధానికి పేరొస్తుందని చంద్రబాబు చెప్పడమే  విచిత్రంగా వుంది. అక్క‌డ త‌మ‌కు స‌రిప‌డా వ్యాపారం ఉంటుంద‌నుకుంటేనే హోట‌ళ్లు వ‌స్తాయి. రాజ‌ధాని అయినంత మాత్రాన రావు. ఇక‌ పరిశ్రమలు ప‌రుగెత్తుకు రావ‌డానికి రాజధాని అంటే పారిశ్రామిక వాడ కాదుక‌దా? ప‌రిశ్ర‌మ‌ల‌కు ఏ ప్రాంతంలో రాయితీలిస్తామంటే అక్క‌డికే త‌ర‌లివెళ్తాయి.  ఇలాంటి హ‌డావుడి ప్ర‌క‌ట‌న‌లు ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్ట‌డానికి మాత్ర‌మే అయితే ప్ర‌జ‌లు వాటిని తేలిగ్గానే గుర్తిస్తార‌ని చంద్ర‌బాబు గ్ర‌హిస్తే మంచిది.