పెళ్లాం చేతిలో కీలుబొమ్మ‌గా మారిన ఏపీ మంత్రి

తాను ఎంత‌గా శ్ర‌మించినా…, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్న ప‌రిస్థితుల్లోనూ.. త‌ల‌కు మించిన స్థాయిలో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నా… ప్ర‌జ‌ల్లో మాత్రం త‌న ప్ర‌భుత్వానికి ఆశించిన స్థాయిలో మైలేజీ రావ‌డం లేద‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెగ ఇదైపోతున్నార‌ట‌.. ఈ ప‌రిస్థితికి అస‌లు కార‌ణ‌మేంటో తేల్చుకునేందుకు ప‌నిలో ప‌నిగా త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌ పనితీరుపై రహస్యంగా విచారణ కూడా జరిపించిన  ముఖ్య‌మంత్రికి అందులో వెల్ల‌డైన స‌మాచారం చూసి దిమ్మ‌తిరిగిపోయిన‌ట్టు స‌మాచారం.

రాజ‌ధాని రాక‌తో అనూహ్యంగా ప్రాధాన్యం పెరిగిపోయిన‌,  రాజకీయచైతన్యం గల జిల్లాలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకుని కన్నా ఆయన భార్యే వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్ట‌డంలో పవర్‌పుల్‌గా వ్యవహరిస్తున్నారని  తెలుసుకుని చంద్ర‌బాబు షాక్ అయ్యార‌ట‌.  ఆ మంత్రివ‌ర్యుడు నిర్వహిస్తున్న శాఖలో వివిధ‌ హోదాల్లో పనిచేస్తున్న అధికారులు కూడా మంత్రిగారి  ఆదేశాల‌ కన్నా…అమ్మగారి ఆజ్ఞ‌ల‌నే శిరసావ‌హిస్తున్నార‌ట‌.  అయితే పైస్థాయి, ఐఎఎస్‌ అధికారులతో మాత్రం మంత్రిగారే మాట్లాడుతూ గుట్టు బ‌య‌ట‌కు రాకుండా… వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెడుతున్నార‌ట‌. దీంతో పలుశాఖాధిపతులు…జిల్లా కలెక్టర్ మాత్రం… అమ్మగారి ప్రభావం చూడలేకపోయార‌న్న‌మాట‌.

సొంత నియోజకవర్గంతో పాటు…జిల్లా హెడ్‌క్వార్టర్స్‌ పోస్టుల్లో అమ్మగారి ప్రభావం బాగానే పనిచేసిందని, ఆ జిల్లా ఎమ్మెల్యేలు కూడా తమ అనుచరులతో ఆవేదన వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ రెండున్నరేళ్లలో జరిగిన ప్రమోషన్లు,బదిలీలు, పోస్టింగ్‌లలో అధిక శాతం అమ్మ‌గారి క‌నుస‌న్న‌ల‌లోనే జ‌రిగాయ‌ట‌. ఈ వ్య‌వ‌హారాల్లో భారీగా ముడుపులు చేతులు మారిన‌ట్టు స‌మాచారం. అయితే ఈ వ్య‌వ‌హారాల‌న్నీ మ‌ధ్య‌వ‌ర్తుల‌ద్వారానే జ‌రిగిపోవ‌డంతో వసూలు చేసిన సొమ్మును ‘అమ్మగారికి ఎంత ఇచ్చారు…వీరెంత వెనకేసుకున్నార‌న్న విష‌యం మాత్రం బయటపడడం లేదు. స‌ద‌రు మంత్రి గారికి ఈ విషయం తెలిసినప్పటికీ ఆమెను అదుపు చేయలేక.. చివ‌ర‌కు త‌న‌ పరువు ప్రతిష్ఠ‌లను పోగొట్టుకోవ‌డ‌మేకాక పార్టీ ప్ర‌తిష్ఠ‌నూ దిగజార్చారు.

రాజకీయ చైతన్యం దండిగా ఉండే ప్ర‌జ‌లున్న ఈ జిల్లాలో మంత్రి పేరుతో  భార్య అధికారం వెల‌గ‌బెట్ట‌డం ఎలా సాధ్య‌మైందో అర్థంకాక‌  పలువురు ఎమ్మెల్యేలు…పార్టీ సీనియర్‌ వర్గాలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారట. ఈ నేప‌థ్యంలో భవిష్యత్‌లో జరగబోయే ఎన్నికల్లో స‌ద‌రు మంత్రివ‌ర్యుల‌కు పార్టీ టికెట్టు హుళ‌క్కేన‌న్న‌ప్ర‌చారం పార్టీ వ‌ర్గాల్లో ఇప్ప‌టినుంచే జోరందుకుంది. అమ్మగారి వ్యవహారశైలి తెలుసుకున్న ముఖ్య‌మంత్రి చంద్రబాబు మ‌న‌సులో ఏముందో ఇంత వరకు బ‌య‌ట‌ప‌డ‌క‌పోయినా… ఆయ‌న ఆ మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుడికి, కీలెరిగి వాత పెట్ట‌డం మాత్రం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.