కేసీఆర్ మొక్కుల ఖ‌రీదు అన్ని కోట్లా!

తెలంగాణ సీఎం కేసీఆర్ మొక్కుల పేరుతో వివిధ దేవుళ్ల‌కు చేయిస్తున్న స్వ‌ర్ణా భ‌ర‌ణాల ఖ‌ర్చు ఖ‌జానాకు తిప్ప‌లు తెస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. రూ.ల‌క్ష‌ల‌లో అయితే, ఈ మొక్కులు తీర్చేందుకు ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రం ఉండ‌దు. కానీ, ఈ మొక్కులు దాదాపు 10 కోట్ల‌కు చేర‌డంతోనే(ఇది ఫ‌స్ట్ ఫేజ్ మాత్రమే. ఇంకా చాలా ఉంది) ప్ర‌జల్లోని ఓ వ‌ర్గం కేసీఆర్ వైఖ‌రిపై అసహ‌నంతో ఉంద‌ని తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటైతే.. అటు ఏపీ, ఇటు తెలంగాణ‌ల్లోని దేవ‌తా మూర్తుల‌కు బంగారు ఆభ‌ర‌ణాలు చేయిస్తాన‌ని మొక్కుకున్న‌ట్టు కేసీఆర్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. ఈ క్ర‌మంలో ఆయ‌న తెలంగాణ సాకారం అయిన త‌ర్వాత సీఎం పీఠం ఎక్క‌డం కూడా జ‌రిగిపోయింది. దీంతో ఇక‌, ఇప్పుడు ఆ మొక్కులు తీర్చుకునే ప‌నిలో ప‌డ్డారు.

తాజాగా, వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి అమ్మ‌వారికి కిరీటం , భుజ కీర్తులు చేయించారు. వీటికి దాదాపు 3 కిలోల‌కు పైగా బంగారాన్ని వినియోగించారు. వీటి త‌యారీకి సుమారు 3 కోట్ల 60 లక్షల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది. అదేవిధంగా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం రెండు ప‌ద్దుల్లో మొత్తం 9 కోట్ల 20 ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇవ‌న్నీ మొక్కుల పేరుతో దేవ‌త‌ల‌కు చేరిపోయాయి. ఇంకా, సీఎం కేసీఆర్ మొక్కులు తీరిపోలేదు. తిరుమ‌ల శ్రీవారు, బెజ‌వాడ దుర్గ‌మ్మ త‌దిత‌రుల ప్ర‌ధాన దేవుళ్లు జాబితాలో ప్ర‌ధానంగా క‌నిపిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో మ‌రింత ఖ‌జానా సొమ్ము క‌న‌కం రూపంలో దేవుళ్ల‌కు చేరిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. సీఎం కేసీఆర్ చేస్తున్న ఈ మొక్క‌లు ఖ‌ర్చుపై ప్ర‌భుత్వం, దానిని స‌మ‌ర్ధిస్తున్న మీడియాకు క్రేజీగా ఉన్నా.. ఓ వ‌ర్గం జ‌నాలు మాత్రం ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇంత పెద్ద మొత్తంలో డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌డంపై పెద‌వి విరుస్తున్నారు. తెలంగాణ సాకారం కావ‌డంలో దేవుళ్ల పాత్ర ప‌రోక్షంగా ఉందేమో కానీ, ప్ర‌త్య‌క్షంగా పాల్గొన్న యువ‌కులు, యువ‌తులు, ప్రాణ‌త్యాగం చేసిన వారు, పోలీసుల లాఠీల‌తో కాళ్లు పొగోట్టుకున్న‌వారు, కాల్ప‌ల్లో గాయ‌ప‌డ్డ‌వారు, చ‌దువుకు దూర‌మైన వారు ఎంద‌రో ఉన్నార‌ని అంటున్నారు. ఇక‌, తెలంగాణ వ‌చ్చాక కూడా రైతులు, చేనేతన్న‌లు, బీడీ కార్మికుల బ‌తుకులు ఏమంత బాలేద‌ని చెబుతున్నారు. ఈ సొమ్మును వారికి వినియోగించి, వారి బ‌తుకుల్లో వెలుగులు నింపాక‌.. మొక్కులు తీర్చుకుంటే అభ్యంత‌రం లేద‌ని చెబుతున్నారు. మ‌రి, సీఎం కేసీఆర్ గారు, ఆయ‌న మిత్ర మండ‌లి వీరి డిమాండ్‌కు స్పందిస్తుందా? అన్న‌దే ప్ర‌శ్న‌. లేదా వీరి నోళ్లు మూయిస్తే.. మ‌రో కిరీట‌మో.. గ‌దో చేయిస్తాన‌ని కేసీఆర్ ఏదేవుడికైనా మొక్కుకుంటారేమో?! చూడాలి.