ఏపీకి కొత్త హోం మంత్రి వ‌స్తున్నాడు..!

ఏపీకి కొత్త హోం మంత్రి వ‌స్తున్నారా? ప‌్ర‌స్తుతమున్న హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌కు ఊష్టింగ్ త‌ప్ప‌దా? ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై సీఎం చంద్ర‌బాబు అసంతృప్తిగా ఉన్నారా? అంటే ఇప్పుడు ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది అమ‌రావ‌తి ప‌రిస‌రాల్లో! ఏపీలోని హోం శాఖ‌పై చంద్ర‌బాబు భారీ ఆశ‌లే పెట్టుకున్నారు. ఇప్పుడిప్పుడు అభివృద్ధి బాట‌లోకి వ‌స్తున్న ఏపీని అన్ని విధాలా ఫాస్ట్‌గా దూసుకుపోయేలా చేయ‌డంలో హోం శాఖ కీల‌క మ‌ని ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతున్నారు. అయితే, గ‌త కొన్నాళ్లుగా జ‌రుగుతున్న ప‌రిణామాల విష‌యంలో సీఎం చంద్ర‌బాబు ఒకింత అసంతృప్తిగానే ఉంటున్నారు.

ముఖ్యంగా రాష్ట్రంలో తీవ్ర అల‌జ‌డి రేపిన కాపు ఉద్య‌మం, అనంత‌రం జ‌రిగిన ప‌రిణామాల‌ను అంచ‌నా వేయ‌డంలోనూ, వాటిని క‌ట్ట‌డి చేయ‌డంలోనూ హోం శాఖ పూర్తిగా విఫల‌మైంది. దీనికి ముందు కూడా విజ‌య‌వాడ కాల్ మ‌నీ వ్య‌వ‌హారం వెలుగు చూసిన స‌మ‌యంలో పోలీసుల వైఖ‌రిపై నేరుగా సీఎం అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇక‌, పూర్తి స్థాయిలో అన్ని అధికారాలూ ఇచ్చినా ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా విష‌యంలోనూ పోలీసులు ఆశించిన ప్ర‌గ‌తి చూపించ‌లేక‌పోయారు. అయితే, మొన్న జ‌రిగిన కృష్ణా పుష్క‌రాలు ఒక్క‌టే ఒకింత రిలీఫ్ ఇచ్చే విష‌యం. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌ధాన పాల‌నా విష‌యాల్లో హోం శాఖ‌పై అసంతృప్తిగా ఉన్న సీఎం చంద్ర‌బాబు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆ శాఖ మంత్రి చినరాజ‌ప్ప‌కు ఉద్వాస‌న ప‌ల‌క‌నున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది.

అదే స‌మ‌యంలో ఈశాఖ‌ని ప్ర‌స్తుత కార్మిక శాఖ మంత్రి అచ్చ‌న్నాయుడికి ప్ర‌మోష‌న్ ఇచ్చి మ‌రీ అప్ప‌గిస్తార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి చంద్ర‌బాబుకు అత్యంత న‌మ్మ‌క‌స్తుడిగా మెలిగిన ఎర్ర‌న్నాయుడి మ‌ర‌ణం త‌ర్వాత ఉత్త‌రాంధ్ర‌లో ఆయ‌న ప్లేస్ ను ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేక పోయారు. కానీ, ఇటీవ‌ల ప‌రిణామాల‌ను చూస్తే.. అచ్చెన్నాయుడు ఒకింత దూకుడుగాను ఉంటున్నారు. అటు కార్మిక‌, ఇటు స్పోర్ట్స్ విష‌యాల్లో ఆయ‌న దూసుకుపోతున్నారు. అదేస‌మ‌యంలో అసెంబ్లీలో వైకాపా అధినేత జ‌గ‌న్ దూకుడుకి రెట్టింపు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ప్ర‌భుత్వంపై ఈగ‌వాల‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

వైకాపా అధినేత జ‌గ‌న్ టార్గెట్‌గా అసెంబ్లీలో వాణిని బ‌లంగా వినిపిస్తున్న మంత్ర‌ల్లో అచ్చెన్నదే ఫ‌స్ట్ ప్లేస్‌. అదేస‌మ‌యంలో  శ్రీకాకుళం జిల్లాలో తెలుగు దేశం పార్టీ బ‌లోపేతానికి కూడా ఈయ‌న బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో అచ్చెన్న చంద్ర‌బాబు దృష్టిలో మంచి మార్కులే కొట్టేశారు. దీంతో ఈయ‌న‌కు ప్ర‌మోష‌న్ ఇచ్చి హోంను అప్ప‌గించాల‌నే యోచ‌న‌లో సీఎం ఉన్న‌ట్టు తెలిసింది. ఇక్క‌డ క‌లిసొచ్చే అంశం ఏంటంటే.. కాపు ఉద్య‌మం జ‌రిగిన‌ప్పుడు వారిని శాంతింప చేయ‌డంలోనూ అచ్చెన్న ముఖ్యపాత్ర పోషించారు. అదేవిధంగా ఈయ‌న బీసీ వ‌ర్గానికి చెందిన నేత‌. సో.. ఇన్ని ఈక్వేష‌న్స్ ప‌నిచేయ‌డంతో త్వ‌ర‌లోనే ఏపీకి కొత్త హోం మంత్రిగా అచ్చెన్న ఖాయ‌మ‌నే టాక్ వినిపిస్తోంది!