చూస్తే తప్పు కాదు, చేస్తేనే తప్పు.

పైరసీ సినిమాలు చూడటం కూడా నేరమే. అయితే అది నిన్నటి మాట. కొత్త మాట ఏంటంటే పైరసీ సినిమాలు చూడచ్చు. ఆన్‌లైన్‌ పైరసీకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ముంబై హైకోర్టు సంచలన తీర్పులో ఈ విషయం వెల్లడించింది. కానీ ఆన్‌లైన్‌ ద్వారా పైరసీకి పాల్పడరాదని, అలా చేస్తే తీవ్రమైన నేరం కిందనే పరిగణించవలసి ఉంటుందని హైకోర్టు స్పష్టతనిచ్చింది. సినిమాకి పైరసీ అనేది పెనుభూతంగా మారింది. సినిమా విడుదలైన మరుక్షణం అది ఇంటర్నెట్‌లో దర్శనమిస్తోంది. ఒక్కోసారి సినిమా విడుదలకు ముందే పైరసీ అవుతోంది. తెలుగులో ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఇలాగే విడుదలకు ముందు పైరసీ బారిన పడింది. పైరసీని అడ్డుకోవడానికి సినీ పరిశ్రమలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడంలేదు.

ఇంటర్నెట్‌ విప్లవం కూడా సినిమా పైరసీకి పెను శాపంగా మారిందని చెప్పక తప్పదు. హై క్వాలిటీ ప్రింట్‌ ఆన్‌లైన్‌లో లభిస్తోంటే, థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసేవారు తగ్గిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు నిర్ణయం అందరికీ షాక్‌ కలిగించింది. ఇదిలా ఉండగా పైరసీ వెబ్‌సైట్లు మాత్రమే కాకుండా బూతు సినిమాల వెబ్‌సైట్లు కూడా ఇటీవలి కాలంలో బ్లాక్‌ అయిపోయాయి. అన్నిటికీ ఒకటే మంత్రం అన్నట్లుగా సర్వీస్‌ ప్రొవైడర్లు బ్లాక్‌ చేసి పారేశారు. హైకోర్టు తీర్పు పాఠం పూర్తిగా అర్థమయితే తప్ప ఆన్‌లైన్‌ పైరసీ, అలాగే బూతు సినిమాల బ్యాన్‌పై స్పష్టత రాకపోవచ్చు.