కాశ్మీర్‌ని పాకిస్తాన్‌కి ఇచ్చేయడానికి ఆయనెవరు?

పాకిస్తానీయులారా మీకు కాశ్మీర్‌ కావాలంటే ఇచ్చేస్తాం, దాంతోపాటుగా ప్యాకేజీ డీల్‌ కింద బీహార్‌ని కూడా తీసుకుపొమ్మని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మార్కండే కట్జూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కట్జూ పట్ల భారతీయులందరికీ ఎంతో గౌరవం ఉంది. న్యాయమూర్తిగా ఆయన్ను అందరూ గౌరవిస్తారు. కానీ ఆయనెందుకు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో అర్థం కావడంలేదు. అయితే తాను ఆ ప్రతిపాదన తీసుకురాగానే, కాశ్మీర్‌ తనకు వద్దని, బీహార్‌ అసలే వద్దని కాశ్మీరీలు సమాధానమిచ్చినట్లు కట్జూ పేర్కొన్నారు. సరదాకే అయినా ఇటువంటి విషయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సగటు భారతీయుడిగా కట్జూకి తగదు.

అయితే గతంలో అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఈ ప్రతిపాదన చేశారని ఆయన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. అసలే పాకిస్తాన్‌, భారత్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, పాకిస్తాన్‌ – కాశ్మీర్‌ కోసం మారాం చేస్తుండగా, ఈ సమయంలో ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు సగటు భారతీయుల సెంటిమెంట్లను దెబ్బతీస్తాయి. ‘కాశ్మీర్‌ మాది, అంగుళాన్ని కూడా వదులుకోం. మీరు ఆశలు వదిలేసుకోవాల్సిందే’ అని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ ఐక్యరాజ్యసమితి వేదికగా, పాకిస్తాన్‌కి తేల్చి చెప్పారు. అది గ్రహించకుండా కట్జూ, కాశ్మీర్‌నీ దాంతోపాటు పాకిస్తాన్‌ ఇచ్చేస్తాననడం శోచనీయం. ఆయన సొంత ఆస్తి కాదు, తనకు ఇష్టమైనవాళ్ళకి కాశ్మీర్‌ని అయినా బీహార్‌ని అయినా రాసిచ్చేయడానికి.