ఇది కూడా వైఎస్‌ జగన్‌ పనేనా చంద్రబాబూ?

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి ఎదురు దెబ్బ తగిలింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు, రాజధాని నిర్మాణం కోసం స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిని ఎంపిక చేశారు. అయితే ఈ పద్ధతిపై హైకోర్టు స్టే విధించింది. నిజానికి స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో లొసుగుల గురించి ప్రపంచ వ్యాప్తంగా విమర్శలున్నాయి. కానీ ఈ విధానం మీద ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్‌ కనిపిస్తుంటుంది. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన బేఖాతు చేసి, స్విస్‌ ఛాలెంజ్‌కి ‘సై’ అన్నారు.

 కానీ హైకోర్టు స్టే ఇవ్వడంతో చంద్రబాబు సర్కార్‌ ఇరకాటంలో పడక తప్పదు. ఇది ప్రతిపక్షం కుట్ర అని చంద్రబాబు విమర్శించి ఊరుకుంటే సరిపోదు. అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్‌ ఆత్మగౌరవం. రాష్ట్ర ప్రజలకు అన్ని వివరాలూ తెలియాల్సి ఉంది. కానీ స్విస్‌ ఛాలెంజ్‌ పేరుతో చాలా విషయాల్ని రహస్యంగా ఉంచుతున్నారు చంద్రబాబు. కారణం సింగపూర్‌ కంపెనీల ఒత్తిళ్ళే. భూమి మనది, అభివృద్ధి చేసేది వాళ్ళు. సింగపూర్‌ కన్సార్టియంతో కలిసి సిఆర్‌డిఎ అమరావతి నిర్మాణాన్ని చేపట్టాలి.

 అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మద్దతుతో, ఇదంతా జరగవలసి ఉంటుంది. కానీ లోపభూయిష్టమైన విధానాలతో ముందడుగు వేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇదివరకటిలానే ప్రతిపక్షంపై ఆరోపణలు చేసి, చేతులు దులుపుకోవాలనుకుంటున్నట్టుంది. హైకోర్టులో విచారణ జరుగుతున్న దశలోనే స్విస్‌ విధానంపై కొన్ని రహస్య విధానాల్ని బహిర్గతం చేయాలనుకున్న ప్రభుత్వం, హైకోర్టులో దాఖలు చేసే కౌంటర్‌లో మరిన్ని వివరాలు తెలపక తప్పదు.