న‌యీం దందా 700 కోట్లు!

గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీమ్ దందాలు ఆక్ర‌మ‌ణ‌లు పోలీసుల విచార‌ణ‌లో త‌వ్వేకొద్దీ బ‌య‌ట‌ప‌డుతున్నాయి. బెదిరింపుల‌కు పాల్ప‌డి అన‌తికాలంలోనే వంద‌ల ఎక‌రాల‌ను నయీం క‌బ్జాచేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ క్ర‌మంలోనే న‌యీం దాదాపు 433 ఎక‌రాల‌ను త‌న భార్య, త‌ల్లి, అనుచ‌రుల పేర్ల మీద‌కు బ‌ద‌లాయించిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. వీటి విలువ వంద‌ల కోట్ల‌లోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది.

రెవెన్యూ ఇత‌ర ప్ర‌భుత్వాధికారుల స‌హ‌కారం లేనిదే భూముల బ‌ద‌లాయింపు కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌దు కాబ‌ట్టి ఇందులో వీరిపాత్ర కూడా ఉండొచ్చ‌న్న అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు పోలీసులు. వారి కుటుంబ స‌భ్యులు స‌న్నిహితుల పేర్ల పైనా 233.29 ఎకారాలు బ‌దిలీకాగా..త‌న అనుచ‌రుల పేరుమీద మ‌రో 189.30ఎక‌రాలకు సంబంధించిన ధృవ‌ప‌త్రాలు ల‌భ్య‌మైన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా భూముల‌కు సంబంధించి ట్రాన్స్‌ఫ‌ర్ కావాల్సిన డాక్యుమెంట్లు ఉన్నాయ‌ని వారు వెల్ల‌డించారు.

ఈ భూముల‌న్నీ హైద‌రాబాద్ శివార్ల‌లో ఉన్నాయ‌ని ఒక్కో ఎక‌రం విలువ దాదాపు రూ.50ల‌క్ష‌ల నుంచి కోటి రూపాయ‌లు ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. న‌యీం ఆక్ర‌మించుకున్న భూముల విలువ రూ.700 కోట్ల‌కు పైగా ఉంటాయంటున్నారు పోలీసులు.కొంద‌రు రాజ‌కీయ నేత‌లు న‌యీంపేరు చెప్పి భూదందాల‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. నేత‌ల పేర్ల‌ను న‌యీం త‌న డైరీలో ప్ర‌స్తావించ‌డంతో వారిలో వ‌ణుకు మొద‌లైంది.