నత్తతో పోటీపడుతున్న పుష్కర పనులు

కృష్ణా పుష్కరాల ఘాట్ల నిర్మాణ పనులు నిర్ధేశించిన గడువు ముగిసినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ముందు పనులు చేయండి తరువాత నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ మాట్లాడుతున్న తీరుతో కాంట్రాక్టర్లు ఘాట్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు సుముఖంగా లేరు. పద్మావతి ఘాట్‌, దుర్గా ఘాట్‌, పున్నమి ఘాట్‌, పున్నమి ఘాట్‌, కృష్ణవేణి తదితర ఘాట్లలో కాంక్రీట్‌ పనులతోపాటు మట్టి పనులు సైతం ఇప్పటికీ నడుస్తున్నాయంటే పనుల తీరు ఏవిధంగా ఉందో అర్ధమౌతోంది.

స్వయంగా ముఖ్యమంత్రి ఘాట్ల నిర్మాణ పనులను జులై 3వ తేదీలోగా ముగించాలని తొలుత ఆదేశించినప్పటికీ 60 శాతం కూడా పనులు పూర్తి కాకపోవడంతో 5వ తేదీకి పొడిగించారు. ప్రస్తుతం పనుల ముగింపు గడువును 8వ తేదీకి నిర్ధేశించారు. 8వ తేదీ నాటికి పనులు ముగించి 10వ తేదీన ఘాట్లను శుభ్రం చేసేందుకు ఫైర్‌ విభాగానికి అప్పగించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ ఆ దిశగా పనులు ముందుకు సాగడంలేదు. పద్మావతి ఘాట్‌లోని కోదండ రామాలయ ప్రాంతంలోగల ఘాట్‌ నిర్మాణంలో మట్టి లెవలింగ్‌ పనులు కూడా పూర్తికాలేదు. అలాగే టైల్స్‌ ఇంకా 50 శాతం పైగా వేయాల్సి ఉంది. దుర్గా ఘాట్‌లో పనులు ప్రశ్నార్ధకంగా మారాయి. టెండర్లలో సదరు కాంట్రాక్టర్‌కు, ప్రభుత్వానికి ఒప్పందంలో చోటు చేసుకున్న తేడాల వలన ఒక్క అడుకు కూడా ముందుకు పడటంలేదు.

కృష్ణవేణి ఘాట్‌లో టైల్స్‌ పనులు పూర్తయినా వాటి నిర్మాణం నాసిరకంగా ఉంది. ఘాట్‌కు, కృష్ణా నదికి మధ్యలో ప్రకాశం బ్యారేజికి దిగువున గల కోదండ రామాలయ ఘాట్‌ వరకు యాత్రికులు స్నానాలు చేసేందుకు నీటి సదుపాయం కోసం ఏర్పాటు చేస్తున్న కాలువ (కాంక్రీట్‌ బెడ్‌) ఒడ్డుకు ఇసుక బస్తాలు వేసే పని నేటికి ఓ కొలిక్కి రాలేదు. నేటికీ నిధులు విడుదల కాకపోవడంతో పనులు చేయించేందుకు కాంట్రాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు