లోకేష్‌ ఉత్తమాటలా? గట్టిమాటలా?

టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ గడ్డ మీద నుంచి లోకేష్‌ సహా తెలుగుదేశం పార్టీని తరిమేసినట్లయ్యింది పరిస్థితి ఇప్పటికే. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలే కాకుండా ఖమ్మం, వరంగల్‌, నారాయణ్‌ఖేడ్‌, మెదక్‌ ఉప ఎన్నికల్లో ఫలితాలు తెలుగుదేశం పార్టీని వెక్కిరించాయి.

దాంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇంకా నీరసించిపోయింది. అయితే పార్టీలు మారే నాయకులకు నైతిక విలువలుండవు. ఇట్నుంచి, అటు జంప్‌ చేసినవారు అటు నుంచి ఇటు జంప్‌ చేయకుండా ఉంటారా? అలా ఆలోచించి చూస్తే లోకేష్‌ మాటల వెనుక కొంత నిజం, కొంత మర్మం కనిపిస్తాయి. ఆ నిజం వీసమెత్తు ఉన్నా లోకేష్‌ చక్రం తిప్పేసి ఒకర్నో ఇద్దర్నో టిఆర్‌ఎస్‌ నుంచి లాగేయగలుగుతారు. ఆ దిశగా ఇప్పటికే టిడిపి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారమ్‌.

అయితే ఆ అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో మాత్రం తెలియరావడంలేదు. మల్లన్న సాగర్‌ వివాదమే కాకుండా హైదరాబాద్‌లో ఏమాత్రం అభివృద్ధి లేకపోవడం వంటి అంశాలతో టిఆర్‌ఎస్‌లో ఇప్పుడిప్పుడే అసమ్మతి సెగ రాజుకుంటోందని సమాచారమ్‌. కెటియార్‌ ప్రాభవాన్ని తట్టుకోలేనివారే పార్టీ పట్ల అసహనంతో ఉన్నారని, అలాంటివారిని కనుగొని చేరదీసేందుకు లోకేష్‌ వ్యూహరచన సిద్ధం చేశారని కూడా తెలియవస్తోంది.