బొంకురామాయణం బాబు వంతొచ్చింది

కట్టే విరగకూడదు పాము చావకూడదు అనే సామెత గుర్తుందా?అచ్చం అలాగే ఉంటుంది చంద్రబాబు వ్యవహారం.కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించ కూడదు అయితే ప్రశ్నించినట్టుండాలి.ఇప్పటికే టీడీపీ రాజ్యసభలో వ్యవహారశైలి పైన,బీజేపీ కి వంత పాడటం పైన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యం లో నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు పాపం బాబు గారు.ఎంతో హుందాగా..అంతకు మించి సీరియస్ గా బాధాతప్త హృదయంతో ప్రెస్ మీట్ మొత్తం రక్తి కట్టించారు బాబుగారు.

పాపం ప్రెస్ మీట్ పెట్టి సుతి మెత్తగా కేంద్రాన్ని విమర్శిస్తూ, వెనకేసుకొస్తూ బాబు పడ్డ పాట్లు అన్ని ఇన్ని కావు.ఎంత సేపు ఆరోజు రాష్ట్ర విభజ జరిగిన తీరు బాధాకరం..పార్లమెంట్ తలుపులు మూసేసారు..టీవీ ప్రసారాలు ఆపేసారు..అని అందరికి తెలిసిన జరిగిపోయిన బాగోతాన్ని మల్లి మల్లి గుర్తు చేశారు తప్ప జరగాల్సిన కార్యం పైన మొక్కుబడి సూచనలు,విన్నపాలతో విలేఖరుల సమావేశం సాగిందంతే.

రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు..రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది..ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై వుంది..ఇదే పాత పాట..ఇదంతా అయిపోయిన ముచ్చట..అందరికి తెలిసిన ముచ్చట..ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు వైఖరేంటి? అనేదే రాష్ట్ర భవిష్యత్ ని నిర్ణయిస్తుంది.ఎంత సేపు ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేయండి,న్యాయం జరగాలి అని చిలకపలుకులు పలికితే ఆంధ్రకు న్యాయం జరిగిపోతుందా?

కాంగ్రెస్ అన్యాయం చేసింది.దానికి శిక్ష కూడా అనుభవించింది,అనుభవిస్తూనే వుంది..అయితే ఇప్పుడు జరిగిన తప్పును కాస్తయినా సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తోంది.ఈ విషయం లో కాంగ్రెస్ ని విమర్శించడం అవివేకం.ఎంత సేపు కనీసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పైన ఈ మాత్రం చర్చయినా జరుగుతోంది అంటే అది కాస్తో కూస్తో కాంగ్రెస్ వల్లనే.దాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలా అనేది వదిలేసి ఎంతసేపు చర్చ తీసుకువచ్చిన కాంగ్రెస్ పై బురదజల్లడం చచ్చిన పాముని మళ్ళీ చంపడం తప్ప వేరే ప్రయోజనం లేదు.

ఒక్క టీడీపీ తప్ప మిగతా పార్టీలవన్ని డ్రామాలేనట..మీరు చేస్తే రియాలిటీ ఎదుటివాళ్ళు చేస్తే డ్రామా..ఇదీ బాబు వరస..నేను కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా…నేను కేంద్రానికి మల్లి అప్పీల్ చేస్తున్నా..ఇవ్వాళా జరిగింది చూసి బాధేస్తుంది..ఇది కరెక్ట్ కాదు..ఇలా సుతి మెత్తగా కేంద్రాన్ని విమర్శిస్తున్నాడా?విన్నవిస్తున్నాడా అని తేల్చుకోలేనంత తెలివిగా రాజకీయ ప్రసంగం చేసేసారు బాబుగారు.

మిగతా రాజకీయ పార్టీ లు డ్రామాలాడినా పర్లేదు ..అది వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాలనే దెబ్బతీస్తుంది తప్ప వేరే ఉపయోగం లేదు.అదే అధికారం లో ఉండి చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు రాష్ట్ర భవిష్యత్ మొత్తాన్ని ప్రస్నార్ధకంగా మార్చేస్తున్నాయి.ఇంకా చంద్రబాబు నేనేం మాట్లాడిన నా భజన మీడియా అంతా చక్కబెట్టేస్తుంది అనే భ్రమలోనే ఉన్నట్టున్నాడు.ఇప్పటికైనా అధికార ముసుగులో ఆడుతున్న డ్రామాలు కట్టిపెట్టి ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం విన్నపాలు వినతులు కళ్ళు బుల్లి కబుర్లు కట్టిపెట్టకపోతే..భజన మీడియా కాదు కదా వాళ్ళ బాబులు దిగివచ్చిన ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.