చంద్రబాబుకి పుష్కరాల దెబ్బ

పుష్కరాల్లో స్నానం పరమ పవిత్రంగా భావిస్తుంటారు. కానీ ఆ పుష్కర జలాలే అపవిత్రం అనే వాదన వస్తే భక్తులు ఆందోళన చెందకుండా ఉంటారా? తెలంగాణ పండితులు, ఆంధ్రప్రదేశ్‌లో పుష్కర స్నానం చేయడం వల్ల ఫలితం ఉండదని స్పష్టం చేయడం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పెద్ద షాక్‌. వారి వాదనకి ఓ కారణం ఉంది. అదేమిటంటే గోదావరి నది, కృష్ణా నదిలో కలవడం వల్ల కృష్ణా నదిలో పుష్కర స్నానం తగినంత ఫలితాన్ని ఇవ్వదట.

అయితే ఇది కుట్రపూరితంగా చేస్తున్న విమర్శ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్‌ పండితులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపి బాల్క సుమన్‌ ఈ వివాదంపై మాట్లాడితే, ఒక నది ఇంకో నదిలో కలవడం వల్ల పవిత్రత పెరుగుతుందే తప్ప, తగ్గదని చెప్పడం ఇందులో పెద్ద ట్విస్ట్‌. గోదావరి నది, తెలుగు రాష్ట్రాల్లో అతి పవిత్రమైన నదిగా గుర్తింపబడుతోంది. అసలంటూ పుష్కరాల ప్రత్యేకత కేవలం గోదావరి నదికే ఉండేది ఒకప్పుడు. కాలక్రమంలో కృష్ణా పుష్కరాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఆ కోణంలో చూసినాసరే, గోదావరి నది – కృష్ణా నదిలో కలవడం వల్ల ఆ నీటిలో స్నానం చేసేవారికి దక్కే ఫలం పెరుగుతుందే తప్ప తరగదు. కానీ సెంటిమెంట్లు రాజేసిన తర్వాత ఆ సెంటిమెంట్లను పట్టుకు వేలాడేవారి కారణంగా ఆంధ్రప్రదేశ్‌కి భక్తుల తాకిడి తక్కువగా ఉండవచ్చునని సమాచారమ్‌. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి పుష్కర భక్తుల తాకిడి దాదాపుగా ఉండబోదట. కోట్లు ఖర్చు చేసి పుష్కరాల కోసం ఏర్పాట్లు చేస్తున్న చంద్రబాబు సర్కార్‌కి ఇది మింగుడు పడని అంశం.