కాంగ్రెస్‌ పార్టీకి ఆ ధైర్యం లేకనే నా..

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దిక్షిత్‌ని, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఓ రాజకీయ పార్టీగా కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించుకోవడంలో ఎవర్నయినా ఎంపిక చేయవచ్చుగానీ ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన షీలా దీక్షిత్‌ని ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ‘ట్రంప్‌ కార్డ్‌’గా వాడుకోవాలనుకోవడమే హాస్యాస్పదం. కాంగ్రెసు పార్టీ నుంచి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ కూడా ఇదే ఉత్తరప్రదేవ్‌ తరఫున పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

పార్టీ ప్రయోజనాల దృష్ట్యా జాతీయ నాయకులం అన్న వాదనను పక్కన పెట్టి పార్టీని ముందుకు నడిపించేందుకు రాహుల్‌గాంధీని సీఎం అభ్యర్థిగా నిలబెట్టినా ప్రయోజనం ఉండేది. కానీ ఆ సాహసం కాంగ్రెసు పార్టీ చేయలేకపోతోంది. ప్రియాంకా గాంధీ పేరు కూడా సీఎం అభ్యర్థిత్వం లిస్ట్‌లో వచ్చినా అది కూడా గాలివార్తగానే మిగిలింది. దేశవ్యాప్తంగా కాంగ్రెసు పార్టీ తీవ్ర సంక్షోభ స్థితిని ఎదుర్కొంటోంది. ఉత్తరప్రదేశ్‌లో అధికార పార్టీ అయిన సమాజ్‌ వాదీ అత్యంత బలోపేతమయ్యిందిక్కడ.

అలాగే ఉత్తరప్రదేశ్‌లో ఇంకో బలమైన రాజకీయ పార్టీ మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ. ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో పోటీ అంటే సమాజ్‌ వాదీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీల మధ్యనే ఉంటుంది. ఆ తరువాతి స్థానానికే కాంగ్రెసు పార్టీ అయినా ఇంకేదైనా పోటీ పడాలి. ఇటువంటి పరిస్థితులలో మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్‌ని బరిలోకి దించడం ద్వారా కాంగ్రెసు పార్టీ ఏం సంకేతాలు పంపదలచుకున్నట్లు?