ఓ రెడ్డి ఓ కాపు ఓ మైనారిటీ- ఇదీ బాబు లెక్క

రాజకీయాల్లో చంద్రబాబు రాజకీయమే వేరయా..ఇది ఇవ్వాల్టి మాట కాదు. రామ రావు గారిని గద్దె దించడానికి వైస్రాయ్ హోటల్ లో రాజకీయం చేసిన రోజులనుండి వినిపిస్తున్న మాటే ఇది. చంద్రబాబు వ్యక్తుల్ని పెద్దగా నమ్మరు అనేది అయన సన్నిహితులే చెప్పే మాట. ఆయన పలురకాల సమీకరణాలకు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు. ఆ సమీకరణాల్లో భాగంగానే ఎవరికైనా ఏదయినా పదవి దక్కాల్సిందే తప్ప వ్యక్తిగత ఎదుగుదలతో ఎంత చేసినా బాబు సమీకరణాలముందు అదంతా బేజారె.

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాలంటే త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ వుండబోతోంది అని బాబు గారు స్వయంగా చెప్పడం అందులోనా కొత్తగా ఓ ముగ్గురిని మాత్రమే కాబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు సూచనప్రాయంగా తెలియజేయడం జరిగింది. అయితే ఆ ముగ్గురు ఎవరనే దానిపై పార్టీ లో పార్టీ బయటా హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.

అయితే ఆ ముగ్గురి పేర్లు ఖరారైపోయినట్టుగా మరో పక్క ప్రచారం జరుగుతోంది.ఎప్పటిలాగే బాబుగారు కుల,మాత,ప్రాంత సమీకరణాల లెక్కల్ని కాచి వడపోసి ముగ్గురి పేర్లు ఫైనల్ చేసినట్టు సమాచారం. ఆ ముగ్గురు సొంత పార్టీ వాళ్ళనుకుంటే పొరపాటు. ముగ్గురూ  కూడా ప్రతిపక్ష వైసీపీ నుండి జంప్ చేసిన వారే కావడం గమనార్హం. కర్నూల్ జిల్లా నుండి భూమా నాగి రెడ్డి,విజయవాడ నుండి జలీల్ ఖాన్,తూర్పు నుండి జ్యోతులనెహ్రూ నే ఆ ముగ్గురు అని ఇన్సైడ్ టాక్.

ఇప్పటికే జంపింగ్ TG కి రాజ్యసభ పదవి కట్టబెట్టిన బాబు మరిన్ని పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించేదిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం.అందులో భాగంగానే ఫిరాయింపుదార్లకు తగిన ప్రోత్సాహం వుంటుందనే దిశగా సంకేతాలు ఇచ్చేందుకే,మున్ముందు మరిన్ని ఫిరాయింపుల్ని ప్రోత్సహించేందుకు మంత్రి వర్గ విస్తరణకు ముగ్గురు వైసీపీ MLA లనే ఎంచుకున్నట్టు సమాచారం.

ఈ ముగ్గురి ఎంపిక వెనుక అనేక సమీకరణాలున్నాయి.భూమా నాగి రెడ్డి ని కాబినెట్ లోకి తీసుకుని రెడ్డి సామాజిక వర్గానికి మేము పెద్ద పీట వేస్తామని చెప్పుకోవడం. అలాగే ఇప్పటివరకు కాబినెట్ లో మైనారిటీ వర్గానికి ప్రాతినిధ్యం లేని లోటును జలీల్ ఖాన్ ని తీసుకోవడం తో చెరిపేసుకోవచ్చు. జలీల్ ఖాన్ పైనున్న కేసులు సంగతేంటా అని అడక్కండి. ఇక పోతే కాపు ఉద్యమ నేపథ్యం లో ముద్రగడ పద్మనాభం తూ.గో జిల్లాకి చెందిన వాడు కాబట్టి అదే జిల్లాకి చెంది కాపు సామాజిక వర్గానికి చెందిన జ్యోతులను కాబినెట్ లోకి తీసుకోవడం ద్వారా ఈ లెక్క సరిచేయొచ్చని బాబు ఐడియా.

మొత్తానికి ఒక రెడ్డి,ఒక కాపు,ఒక మైనారిటీతో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నామన్న సందేశం ప్రజల్లోకి తీసుకెళ్లేలా బాబుగారు మంత్రివర్గ విస్తరణ ప్లాన్ చేశారు. వారు ఫిరాయింపు దారులా,నేరారోపణలు వున్నవారా అని సంబంధం లేదు. ఇప్పటికే కేబినెట్లో కమ్మ సామాజిక వర్గం కన్నా కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులే అధికంగా వున్నారు.ఇది వ్యూహాత్మక ఎత్తుగడే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం మంత్రి పదవుల్లోనే కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం తప్పితే,పార్టీ అంతర్గతంగా అన్ని కార్యక్రమాల్లోనూ కమ్మ సామాజిక వర్గానిదే పెత్తనం అనేది జగమెరిగిన సత్యం.