సోమూ వీర్రాజుపై అవినీతి అభియోగాలా..!

తమ పార్టీ అధినేత చంద్రబాబుపై ఇతర బీజేపీ నేతలకు భిన్నంగా వ్యవహరిస్తున్న సోమూ వీర్రాజుపై తెలుగుదేశం పార్టీ తన అస్త్రాన్ని ప్రిపేర్ చేసింది. సోమూ వీర్రాజు పచ్చి అవినీతి పరుడు.. భారతీయ జనతా పార్టీ సభల నిర్వహణ కోసం నిధుల సేకరణ చేసి.. వాటిని మింగేశాడు అనేది తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వినిపిస్తున్న ఆరోపణ. ఈ విధంగా సోమూవీర్రాజు అవినీతి పాల్పడ్డాడు అని తెలుగుదేశం నేతలు ఆఫ్ ది రికార్డుగా ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు.

ఈ విషయంలో సోమూ వీర్రాజును కార్నర్ చేయడానికి బీజేపీనే వాడేసుకొంటుండటం ఇక్కడ విశేషం. ఇటీవల భారతీయ జనతా పార్టీ జాతీయ నేత సిద్ధార్థ్ సింగ్ ఏపీకి వచ్చి ఇక్కడి నేతలతో సమావేశం అయిన సమయంలో.. సోమూ వీర్రాజు అవినీతి అంశం కూడా చర్చకు వచ్చిందనే ప్రచారాన్ని గట్టిగా చేస్తోంది తెలుగుదేశం అనుకూల మీడియా, తెలుగుదేశం సోషల్ నెట్ వర్కింగ్ సైన్యం.

పార్టీ సభల నిర్వహణ కోసం సేకరించిన నిధుల గోల్ మాల్ పై దృష్టి పెడతాడమని సిద్దార్థ్ సింగ్ వ్యాఖ్యానించాడట. దీంతో సోమూ వీర్రాజు గుండెలు గుభేల్ మన్నాయట. ఈ విషయంలో పార్టీ అంతర్గత విచారణను చేపట్టి.. నిధులు మింగేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. బీజేపీ వర్గాలు ముక్తకంఠంతో నినదించాయట! దీంతో సోమూ వీర్రాజుకు ఇక కష్టాలే అని , బీజేపీ జాతీయ నాయకత్వం ఆయన భరతం పడుతుందని.. తెలుగుదేశం అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి.

పచ్చపార్టీ సోషల్ మీడియా సైన్యం కూడా సోమూ వీర్రాజు విషయంలో ఈ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీలోని ఒక సామాజికవర్గ నేతలు సోమూ వీర్రాజుకు పార్టీ ఏపీ అధ్యక్ష పదవి దక్కకుండా బలంగా లాబీయింగ్ చేస్తున్నాయనే అభిప్రాయాలున్నాయి. మరి ఇప్పుడు చంద్రబాబుపై ధాటిగా విమర్శలు చేస్తున్న ఆయనపై అవినీతి పరుడుగా ముద్రవేయడానికి తెలుగుదేశం పార్టీ వర్గాలు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తుండటం విశేషం.