పట్టుబడ్డ రూ.570 కోట్లు ఆ రాజకీయ నేతవే..?!

తమిళనాడు నుంచి ఏపీ వైపు తరలి వస్తూ పట్టుబడి సంచలనం సృష్టించిన రూ.570 కోట్లు ఎవరివి? ఇంత సంచలనం కలిగించిన అంశం గురించి వార్తలు, చర్చలు చప్పున చల్లారి పోయాయేం? నిజంగానే ఈ డబ్బు బ్యాంకులదేనా.. నిజంగానే ప్రభుత్వానికి చెందిన సొమ్మేనా? ఒకవేళ బ్యాంకు వారే ఈ డబ్బును తెప్పించుకుంటున్నట్టు అయితే… ఆ పని సైలెంట్ అయిపోతుంది. కంటెయినర్లలో డబ్బుకు కాపాలాగా పోలీస్ ఫోర్సే ఉంటుంది. అయితే ఇక్కడ కంటైనర్లకు భద్రతగా వచ్చిన వ్యక్తులు చెక్ పోస్ట్ లో అధికారులు ఆపగానే ఎందుకు పారిపోయారు? తాము పోలీసులమని వారు ఎందుకు ఆధారాలు చూపలేకపోయారు?

వారు అనుమానాస్పదంగా ప్రవర్తించడం వల్లనే కదా.. ఈ డబ్బు ఉదంతం మీడియాకు ఎక్కింది. నిజంగానే బ్యాంక్ వాళ్లు ఈ డబ్బును తెప్పించుకుని ఉండుంటే… దానికి బోలెడన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఎవరో డమ్మీ పోలీసులు దానికి భద్రతాగా రావడం.. అసలు పోలీసులను చూడగానే వారు పారిపోవడానికి ప్రయత్నించడం.. అటు నుంచి ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కావడం జరిగేదే కాదు. బ్యాంకు వారి నుంచి అయితే నామమాత్రపు ప్రకటన వచ్చింది. ఆ డబ్బు మాదే అని. అయితే సొమ్ములు పట్టుబడ్డ 24 గంటలకు గాని వారి నుంచి ప్రకటన రాలేదు!

అంతభారీ సొమ్ము గురించి మీడియా లో వార్తలు వస్తున్నా.. ఆ బ్యాంకు అధికారులు 24 గంటల వరకూ మేలుకోలేదని సమాధానపడాలా? అంత డబ్బును తెప్పిస్తున్న బ్యాంకు అధికారులు అదిఎప్పటికప్పుడు ఎక్కడి వరకూ వచ్చిందో.. కంటైనర్లు ఎక్కడికి చేరుకున్నాయో వాకబు చేయరా? అది కూడా 24 గంటలకు గానీ వారు అలర్ట్ కాలేదా?

ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే ఇలాంటి అనుమానాలు కలుగుతాయి. డ్రైవర్లు పారిపోయే ప్రయత్నం చేశారు.. డబ్బుతో వస్తున్న కంటైనర్లకు భద్రతగా కార్లలో వస్తున్న ఎస్కార్ట్ సిబ్బందీ పారిపోయే యత్నం చేశారు.. అనే సమాచారం చాలు. ఈ డబ్బు వెనుక ఏదో గూడుపుఠానీ ఉందని అనిపించడానికి. ఈ విషయం గురించి ఇప్పుడు తమిళనాడులో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇది బ్యాంకు డబ్బు అనేది ఉత్తమాట అనేది అక్కడ నుంచి వినిపిస్తున్న మాట. ఈ రూ.570 కోట్ల రూపాయలు ఒక తమిళనాడు రాజకీయ నేత కు చెందినవి అనే మాట గట్టిగా వినిపిస్తోంది.

తమిళనాట ఎన్నికల కోలాహళం ముగుస్తున్న దశలో తనకు ఎదురుగాలి తప్పదేమో అనే భావనతో ఆ రాజకీయ నేత ఈ డబ్బును తమ రాష్ట్రం దాటించారని సమాచారం. ఐదేళ్ల నుంచి దర్జాగా గడిపేసిన ఆ నేతకు ఈ సారి ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయనే అనుమానాలు కలగడంతోనే ఈ డబ్బును రాష్ట్రం దాటించే యత్నం జరిగిందని తెలుస్తోంది. అనూహ్యంగా ఓటమి ముంచుకొస్తుందనే భయంతో తను సేఫ్ గా ఉండటానికి డబ్బును స్వరాష్ట్రం దాటించే పని చేశారని సమాచారం.

పట్టుబడింది కేవలం కొన్ని కంటైనర్లలోని డబ్బే! పట్టుబడ్డ రూ.570 కోట్ల రూపాయలు మాత్రమే కాదు. అప్పటికే ఆ నేతాశ్రీ డబ్బుతో తమిళనాడు సరిహద్దు దాటిన కంటైనర్లు చాలా ఉన్నాయి! వాటన్నింటిలోనూ తరలిన మొత్తాన్ని లెక్కబెడితే ఏపీ వైపు వచ్చిన డబ్బు కొన్ని వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని సమాచారం. చివర్లో ఈ కంటైనర్లను ముందస్తు సమాచారంతోనే అధికారులు పట్టుకున్నారు. తీరా డబ్బు పట్టుబడటంతో ఆ నేత రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుకున్నారనే వ్యాఖ్య కూడా వినిపిస్తోంది.

కేంద్రంలో తనకున్న పరపతిని ఉపయోగించుకునే.. ఏకంగా కేంద్రంలో డబ్బు వ్యవహరాలను చూసే శాఖ నుంచే ఆదేశాలు ఇప్పించి .. ఆ డబ్బు ప్రభుత్వానిది అనే ప్రకటన చేయించారనే ప్రచారం జరుగుతోంది. పట్టుబడ్డ మొత్తంలో కొంత పర్సెంటేజీని కేంద్రంలోని ముఖ్య నేతలకు ఆఫర్ చేయడంతో వ్యవహారం సద్దుమణిగిందని సమాచారం. నిజంగానే ప్రభుత్వం డబ్బును తీసుకొస్తూ ఉండి ఉంటే.. దానితో పాటు వచ్చే వారు బిత్తర చేష్టలకు, పారిపోవడానికి ప్రయత్నించే అవకాశాలే లేవు అనేది నిస్సందేహం.

వారు అలా ప్రవర్తించినా ఆ డబ్బు ప్రభుత్వానిదే అని ప్రకటన రావడానికి ఆ ఐదువందల డెబ్బై కోట్లలో కొంత పర్సెంటేజీని కేంద్రంలోని ముఖ్య నేతకు వాటాగా ఆపర్ చేశారట తమిళ నేత. దీంతో సంచలనంగా మారిన అంశం చప్పున చల్లారి పోయింది. సంపాదన విషయంలో..విలాసాల విషయంలో ఇప్పటికే దేశ రాజకీయాల్లో సంచనాలు నమోదు చేసిన ఆ నేత ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయల సంపదను రాష్ట్రాలు దాటించి.. భారత రాజకీయ నేతల వద్ద ఏ స్థాయిలో నల్లధనం ఉంటుందో ప్రపంచానికి మరోసారి చాటి చెప్పారు. మేరా భారత్ మహాన్!