టీడీపీ ఆ పని చేస్తే బీజేపీ ఊరుకుంటుందా?

ఒకవైపు “ప్రత్యేక హోదా’’ తో ఏమొస్తుందండీ.. అంటూ దాన్నితక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు ఆ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడానికి కూడా తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ప్రత్యేక హోదా వస్తే.. ఒక లాభం, అది తమ వల్ల వచ్చిందని చెప్పుకోవడానికి ఒక ప్లాన్ ను, అది గనుక రాకపోతే దాని కోసం తాము తీవ్రంగా ప్రయత్నించాం కానీ.. బీజేపీనే దానికి సహకరించలేదు.. అనే రెండో గేమ్ ప్లాన్ తో కూడా తెలుగుదేశం ముందుకు వెళ్లడానికి స్కెచ్ వేస్తోంది.

ప్రత్యేక హోదా కోసం అంశం గురించి ఇప్పుడు ఇతర పార్టీల మద్దతును కూడగట్టనుందట తెలుగుదేశం పార్టీ! అందుకోసం ఢిల్లీలో ఇతర పార్టీ నేతలను కలవనున్నారట తెలుగుదేశం నేతలు. ఈ అంశం పై లోక్ సభలో చర్చ జరిగిందని.. అప్పుడు అన్ని పార్టీలూ విభజనకు అనుకూలంగా నిలిచాయని.. కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని అన్ని పార్టీలూ బాధ్యతగా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు దేశంలోని ఇతర పార్టీల నేతలను కోరనున్నారట. దీని కోసం తెలుగుదేశం నేతలు త్వరలోనే ఢిల్లీ యాత్రను చేపట్టనున్నారట. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనకుండా.. తన పార్టీ ఎంపీలను దీని కోసం రంగంలోకి దించనున్నారని తెలుస్తోంది.

అంటే .. ప్రత్యేక హోదా అంశంపై బీజేపీతో కట్టెవిరగని, పాము చావని గేమ్ ను ఆడాలని బాబు ప్లాన్ చేసినట్టున్నారు. ఒకవైపు తను బీజేపీని వెనకేసుకు వస్తున్నట్టుగా మాట్లాడుతూ, మరోవైపు తన పార్టీ ఎంపీల ను రంగంలోకి దించి తాము ప్రత్యేక హోదా అంశం గురించి బీజేపీపై ఒత్తిడి తీసుకొస్తున్నామని ప్రజలకు చూపించాలని బాబు భావిస్తున్నారు. కొన్ని రోజులు ఇలా పొద్దు పొచ్చితే ఎన్నికలకు ఏడాది సమయం ఉండగా.. అప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసేసుకున్నా సరిపోతుంది… అనేది చంద్రన్న రాజకీయ వ్యూహమని సమాచారం.

మరి ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలు ఎన్డీయేలోని పార్టీలనో లేక ఎన్డీయేతో సమదూరంలో ఉన్న పార్టీ వాళ్లను కలిసి.. ప్రత్యేక హోదా అంశం గురించి చర్చలు జరుపుతూ.. బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తే.. కమలం పార్టీ ఊరికే ఉంటుందా? చూసి చూడనట్టుగా వ్యవహరించగలదా?