ఇండియా, పాక్ మ్యాచ్ ర‌ద్ద‌యితే సూప‌ర్ 4కు పాక్‌.. మ‌రి ఇండియా…!

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు వాన గండం పొంచి ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే పాకిస్తాన్ సూపర్ 4కు చేరుతుంది. మరి భారత్ పరిస్థితి ఏంటి?సెప్టెంబర్ 2వ తేదీ ఆసియా కప్ 2023 లో హై వోల్టేజి మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు ఈ శనివారం తాడో పేడో తేల్చుకోనున్నాయి.ఇప్పటికే నేపాల్ తో జరిగిన ఆరంభ పోరులో గెలిచిన పాకిస్తాన్ ఆసియా కప్ లో శుభారంభం చేసింది. నేపాల్ పై నెగ్గిన జట్టు 2 పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో టాప్ పొజిషన్లో ఉంది.

ఇక సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. ఈ లెక్కన పాకిస్తాన్ మూడు పాయింట్లతో సూపర్ 4కు చేరుకుంటుంది. ఇక భారత్ ఖాతాలో ఒక పాయింట్ చేరుతుంది. నేపాల్ తొలి మ్యాచ్ లో ఓడిపోవడంతో ఆ జట్టు ఖాతాలో 0 పాయింట్లు ఉన్నాయి. గ్రూప్ ‘ఎ’లో పాకిస్తాన్ తొలి స్థానంలో ఉంటుంది. భారత్ రెండో స్థానంలో ఉంటుంది.ఇటువంటి పరిస్థితిలో గ్రూప్ ‘ఎ’ నుంచి సూపర్ 4కు చేరుకునేందుకు భారత్, నేపాల్ కు ఇంకా అవకాశాలు ఉంటాయి. ఈ రెండు క్రికెట్ జట్లు మధ్య సెప్టెంబర్ 4న మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా సూపర్ 4 కు చేరుతుంది. అయితే ఈ మ్యాచ్ కు కూడా వర్ష సూచన ఉంది. వర్షం కారణంగా భారత్, నేపాల్ మ్యాచ్ కూడా రద్దయితే అప్పుడు ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు భారత్ కు రెండు పాయింట్లు ఉంటాయి. నేపాల్ ఖాతాలో ఒక పాయింట్ చేరుతుంది. అప్పుడు పాకిస్తాన్ గ్రూప్ టాపర్ గా.. భారత్ గ్రూప్ రన్నరప్ గా సూపర్ 4కు చేరుకుంటుంది. ఇక సూపర్ 4లో గ్రూప్ బి నుంచి వచ్చే మరో రెండు జట్లతో కలిపి రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ఇందులో టాప్ 2లో నిలిచిన జట్లు ఫైనల్స్ కు చేరుకుంటాయి.