సాయిరెడ్డి దూకుడు ప‌నిచేసేట్టు లేదే… తెర‌చాటున జ‌రుగుతోంది ఇదే..!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు పార్టీకి దూరంగా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి.. మ‌ళ్లీ యాక్టివ్ అయ్యారు. నియోజ‌క‌వ‌ర్గా ల్లో ఆయ‌న గుట్టు చ‌ప్పుడు కాకుండా ప‌ర్య‌టిస్తున్నారు. నాయ‌కుల తీరుతెన్నుల‌ను ఆయ‌న ప‌రిశీలిస్తు న్నారు. అంతేకాదు, చిల‌క‌లూరి పేట వంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల‌పైనా ఆయ‌న దృష్టి పెట్టారు. మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ వంటివారిని ఒక వేదిక‌పై చేర్చి.. పార్టీ ప‌రిస్థితిని, నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న రాజ‌కీయాల‌ను కూడా ఆయ‌న చ‌ర్చిస్తున్నారు.

అయితే.. గ‌తంలో ఉన్నంత గౌర‌వం, గ‌తంలో సాయిరెడ్డి మాటకు ఉన్న వాల్యూ కూడా.. అంత‌గా ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. ఎవ‌రూ పెద్ద‌గా ఆయ‌న‌ను సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఇటీవ‌ల చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంపై స‌మీక్షించ‌గా.. ఇక్క‌డ మంత్రి దూకుడు కార‌ణంగా పార్టీ నేత‌లు గ్రూపు రాజ‌కీయాలు చేస్తున్న‌ట్టు గుర్తించిన సాయిరెడ్డి మంత్రిని ఒక విధంగా గ‌ట్టిగానే హెచ్చ‌రించారు. గ్రూపు రాజ‌కీయాలు చేయొద్ద‌ని కూడా చెప్పారు.

అయితే.. ఆ స‌మ‌యానికి ఓకే అన్న‌ప్ప‌టికీ.. మ‌రుస‌టి రోజు మ‌ళ్లీ ష‌రా మామూలే అన్న‌ట్టుగా నియోజ‌క‌వ ర్గంలో ప‌రిస్థితి మారిపోయింది. ఇక‌, న‌ర‌స‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గంపైనా సాయిరెడ్డి అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. ఇక్క‌డ కూడా.. సొంత పార్టీలో వ‌ర్గ పోరు పెరిగిపోయింద‌ని.. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి.. కొంద‌రిని మాత్రం చేరి దీసి.. మ‌రికొంద‌రిని దూరంగా పెడుతున్నార‌నే ఫిర్యాదులు కొన్నాళ్లుగా వెల్లువెత్తుతున్నాయి.

ఇక్క‌డ కూడా సేమ్ టు సేమ్‌. సాయిరెడ్డి స‌మీక్షించ‌డం.. అంద‌రూ స‌రిగా ఉండాల‌ని ఆదేశించ‌డం జ‌రిగి పోయాయి. ఆయ‌న ముందు అంతా ఓకే అన్నా.. త‌ర్వాత మాత్రం ఎవ‌రి రాజ‌కీయం వారిదే అన్నట్టుగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, కీల‌క‌మైన క‌ర్నూలు జిల్లాలో ప‌రిస్థితి సాయిరెడ్డికి కొరుకుడుపడేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ గ్రూపు రాజ‌కీయాల జోరు గుంటూరు క‌న్నా ఎక్కువ‌గా ఉండ‌డంతో సాయిరెడ్డి త‌ల‌ప‌ట్టుకున్నార‌ట‌. త‌న ముందు బాగానే తలాడిస్తున్న నాయ‌కులు త‌న వెనుక మ‌ళ్లీ య‌థాప్ర‌కారం గ్రూపు రాజ‌కీయాలు చేయ‌డం ప‌ట్ల ఆయ‌న అస‌హ‌నంతో ఉన్నార‌ని స‌మాచారం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.