అర్జున్‌పై మీటూ కేసు మళ్లీ తెరపైకి.. ఆధారాలు ఇవ్వండి అంటూ..!

శ్రీ మంజునాథ, హనుమాన్ జంక్షన్, పుట్టింటికి రా చెల్లి, శ్రీ ఆంజనేయం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు అర్జున్ సర్జా. ఇక కన్నడ, తమిళంలో లెక్కలేనన్ని సినిమాలు చేశాడు. 2017లో కన్నడ భాషా చిత్రమైన విస్మయలో ఈ హీరో నటించాడు. ఇందులో అర్జున్ సరసన శృతి హరిహరన్ నటించింది. అయితే కొంతకాలం తర్వాత ఆమె మీటూ ఉద్యమంలో భాగంగా అర్జున్ సర్జాపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మూవీ షూటింగ్ టైమ్‌లో అర్జున్ తనని లైంగికంగా వేధించాడని శృతి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు కూడా నమోదు చేసింది.

అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎలాంటి ఎవిడెన్స్ దొరకక చివరికి బి రిపోర్టును న్యాయస్థానంలో సమర్పించారు. అయితే దీనిని కూడా శృతి సవాలు చేయడం తాజాగా సంచలనంగా మారింది. శృతి ఈ బి-రిపోర్టును విభేదించగా కోర్టు ఆమెకు మరొక ఛాన్స్ ఇచ్చింది. పోలీసులకు ఆధారాలు ఇవ్వాలంటూ బెంగళూరులోని 8వ ఏసీఎంఎం కోర్టు శృతికి రీసెంట్‌గా నోటీసులు సైతం జారీ చేసింది. ఒకవేళ శృతి హరిహరన్ తన ఆరోపణలకు మద్దతి ఇచ్చే తగిన సాక్ష్యధారాలను సమర్పించకపోతే కోర్టు అర్జున్ కి క్లీన్ చిట్ ఇస్తుంది.

కాగా శృతి అర్జున్‌కు వ్యతిరేకంగా ఆరోపణ చేసిన సమయంలో ఆమెపై కన్నడ పరిశ్రమ మండిపడింది. మరికొందరు మాత్రం సపోర్టుగా మాట్లాడారు. సాక్షులు, సాక్ష్యధారాలు ఉంటేనే ఎవరి ఆరోపణలనైనా కోర్టు పరిగణిస్తుంది. లేదంటే ఆ కేసు నిలబడదు. మరి శృతి హరిహరన్ ఎలాంటి ఎవిడెన్స్ కోర్టు ముందు సమర్పిస్తుందో చూడాలి. ఇక మీటూ ఉద్యమంలో భాగంగా సింగర్ చిన్మయి శ్రీపాదతో పాటు చాలామంది మహిళలు ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అవేమీ కూడా ఇప్పటివరకు నిరూపితం కాకపోవడం గమనార్హం.